భారత వైమానిక దళానికి చెందిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా పాల్గొనబోతున్న అంతరిక్ష ప్రయోగం అనూహ్యంగా వాయిదా పడింది. యాక్సియమ్-4 పేరుతో చేపట్టనున్న ఈ మిషన్ మే 29న జరగాల్సి ఉండగా, తాజాగా దానిని జూన్ 8కి పొడిగించారు. అమెరికా ఆధారిత యాక్సియమ్ స్పేస్ సంస్థ, నాసాతో కలిసి చేపడుతున్న ఈ ప్రయోగానికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) షెడ్యూల్ మార్పులు కారణమని అధికారులు తెలిపారు. ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి జూన్ 8న సాయంత్రం 6:41 గంటలకు ప్రయోగం జరగనుంది.
ఈ ప్రయోగ బృందంలో శుభాంశు శుక్లాతోపాటు హంగేరీ, పోలాండ్‌కు చెందిన వ్యోమగాములు ఉన్నారు. ఈ మిషన్‌తోపాటు వీరు ఐఎస్ఎస్‌లో అడుగుపెట్టే తమ దేశాల మొదటి వ్యక్తులుగా చరిత్రలో నిలవబోతున్నారు. అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన అమెరికన్ వ్యోమగామి పెగ్గీ విట్సన్ ఈ మిషన్‌కు కమాండర్‌గా వ్యవహరించనున్నారు. ఇది ప్రభుత్వ భాగస్వామ్యంతో జరుగుతున్న రెండో వాణిజ్య మానవ సహిత యాత్రగా గుర్తింపు పొందింది.
ఈ ప్రయాణంలో శుభాంశు శుక్లా ఐఎస్ఎస్‌లో ఏడు ప్రయోగాలు నిర్వహించనున్నారని సమాచారం. ముఖ్యంగా సూక్ష్మ గురుత్వాకర్షణలో మానవ శరీరంపై ప్రభావం, భారత ఆహారాల పై ప్రయోగాలు ఉండనున్నాయి. పెసర, మెంతి మొలకల పెంపకంతో పాటు, పర్యావరణ పరిస్థితులపై పరిశీలనలు చేయనున్నారు. ఇదంతా భారత్ భవిష్యత్తు అంతరిక్ష ప్రణాళికలకు కీలకంగా మారనుంది.
2035 నాటికి దేశీయ అంతరిక్ష కేంద్రాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో భారత్ ముందుకెళ్తోంది. ఈ ప్రయోగం ఆ దిశగా కీలక అడుగుగా మారనుంది. 2047 నాటికి చంద్రుడిపై భారత వ్యోమగాములను పంపే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండగా, శుక్లా మిషన్‌కు విశేష ప్రాధాన్యత ఏర్పడింది.