Bloody Mary Review : ఎలివేషన్ దాకా వెళ్ళిపోయారు ‘బ్లడీ మేరీ’ రివ్యూ!

రేటింగ్ :  2/5

రచన – దర్శకత్వం :  చందూ మొండేటి

 తారాగణం : నివేదా పేతురాజ్, రాజ్ కుమార్ కసిరెడ్డి, కిరీటి దామరాజు, అజయ్, బ్రహ్మాజీ తదితరులు

కథ : ప్రశాంత్ కుమార్,

సంగీతం : కాలభైరవ

ఛాయాగ్రహణం : కార్తీక్ ఘట్టమనేని

 బ్యానర్ : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ

  నిర్మాత : టిజి విశ్వప్రసాద్

Bloody Mary Review : ‘ఆహా’ ఓటీటీ కోసం చందూ మొండేటి దర్శకత్వంలో విడుదలైన వెబ్ మూవీ ‘బ్లడీ మేరీ’– హీరోయిన్ క్యారక్టర్ ఎలివేషన్ తో ‘లో- బడ్జెట్ కేజీఎఫ్’అనుకునేలా వుంది.లేత హీరోయిన్ నివేదా పేతురాజ్ ని ఎక్కడికో తీసికెళ్ళి మాఫియా డాన్ గా ఎస్టాబ్లిష్ చేసి,సీక్వెల్ హింట్ కూడా ఇచ్చారంటే,పెద్ద ప్రణాళికలే వున్నాయి పానిండియా మూవీ లెవెల్లో.

ముగింపులో నివేదా క్యారక్టర్ కి అట్టహాసంగా ‘కేజీఎఫ్ 2’ లెవెల్లో ఎలివేషన్ ఇవ్వడం చూస్తే, ఈ ముగింపు ఎలివేషనే ప్రధానం -మిగతా కథ అనవసరమన్న ధోరణిలో ఈ గంటన్నర వెబ్ మూవీ వుంది సహనాన్ని పరీక్షిస్తూ.

ఒక మూవీ ఏ తీరున కథనం చేస్తే అది స్టేజి నాటకంలా తయారై బాధపెడుతుందో భావి దర్శకులు తెలుసుకోవడానికి ఒక మోడల్ స్క్రీన్ ప్లే కూడా ఇది.

రెండు రోజులు జరిగే కథ చూపించి, హీరోయిన్ కి ఇంటర్నేషనల్ మాఫియా డాన్ ఎలివేషన్ ఇస్తే, పాపం నివేదా పేతురాజ్ అటు ‘గాడ్ మదర్’ షబనా అజ్మీ కాలేక, ఇటు ‘గంగూబాయి ఖఠియావాడీ’ ఆలియా భట్టైనా కాలేక సతమతమై పోయింది.

‘కేజీఎఫ్’ హీరో రాకీభాయ్ అనాధగా మొదలై బిగ్ డాన్ అయినట్టూ, నివేదా పాత్ర అనాధ మేరీ కూడా బ్లడీ మేరీగా, బిగ్ డాన్ గా మారడం ఈ మినీ కేజీఎఫ్ కి జస్టిఫికేషన్.

వైజాగ్ లో అనాధ మేరీ (నివేదా) ఇంకో ఇద్దరు అనాధలు రాజు (రాజ్ కుమార్ కాశీ రెడ్డి), బాషా (కిరీటి దామరాజు) లకి చిన్నప్పట్నుంచీ పెద్ద దిక్కుగా వుంటుంది. ఒక ఫ్లాట్ లో వుంటారు. తను నర్సుగా పనిచేస్తూంటుంది. తనకి దృష్టి లోపం, అందుకని కాంటాక్ట్ లెన్సులు వాడుతుంది.

రాజు చెవిటి వాడు. ఇతడికి కెమెరామాన్ అవ్వాలని కోరిక. బాషా మూగవాడు. ఇతడికి సినిమా హీరో నవ్వాలని ఆశయం. ఇలా గాంధీగారి మూడుకోతుల సారాంశాన్ని సర్వ్ చేస్తూ ఈ పాత్రలుండవు. సరికదా, చెప్పిన పాత్రల ఆశయాలు కూడా పాత్ర చిత్రణల్లో కనిపించవు.

ఒకరోజు డాక్టర్ మిస్ బిహేవ్ చేస్తూంటే, మేరీ నెట్టేస్తే కింద పడి ఏదో గుచ్చుకుని చచ్చిపోతాడు డాక్టర్. ఈ కేసు పట్టుకుని మేరీ దగ్గరి కొస్తాడు సీఐ ప్రభాకర్ (అజయ్). వచ్చే ముందు తన భార్యతో మిస్ బిహేవ్ చేసిన సినిమా దర్శకుణ్ణి తొక్కి చంపేసి వస్తాడు.

ఈ హత్య అక్కడికి వేషం కోసం వెళ్ళిన మూగ బాషా చూస్తాడు. ఈ హత్య రికార్డయిన కెమెరా చెవిటి రాజుకి దొరుకుతుంది.

దీన్ని పెట్టుకుని సీఐ ప్రభాకర్ ని బ్లాక్ మెయిల్ చేస్తుంది మేరీ. ఇంతవరకు సెటప్ బావుంది బిగినింగ్ కథకి. మేరీ చేసిన హత్యలో ఆమెని పట్టుకోవాలని సీఐ, అలా చేస్తే సీఐ చేసిన హత్య బైట పెడతానని మేరీ బ్లాక్ మెయిల్ చేసేలాంటి సిట్యుయేషన్ ఏర్పడిందని మనకి అర్ధమవుతుంది. ఇప్పుడేం జరుగుతుందన్న ఇంట్రెస్టింగ్ క్రైమ్ డ్రామా క్రియేట్ అయ్యిందన్పిస్తుంది.

ఈ డ్రామాలో ఎవరు గెలుస్తారు? హంతకులైన ఈ ఇద్దరితో హతుల కెలా న్యాయం జరుగుతుంది? దీనికి ఎవరి అంతరాత్మ మేల్కోవాలి? న్యాయాన్ని డిమాండ్ చేసే నైతిక ఆవరణ గల కథ అన్పిస్తుంది.

న్యాయమంటే నేరస్థుడికి శిక్షపడడం కాదు, బాధితుడికి న్యాయం జరగడం. శిక్ష న్యాయంలో ఒక భాగం మాత్రమే. ఈ సెటప్ లో వెంటాడే ప్రశ్న- హతులైన వాళ్ళకి న్యాయమెలా లభిస్తుందన్నదే.

కథంటే తప్పొప్పుల జడ్జ్ మెంట్ చెప్పేదే అయినప్పుడు, తలెత్తిన డ్రమెటిక్ క్వశ్చన్ కి సమాధానం చెప్పగల్గితే, ఆ కథ ఏర్పాటైన సెటప్ తో సరైన దారిలో వున్నట్టు.

కానీ హంతకులైన ఈ ఇద్దరితో హతుల కెలా న్యాయం జరుగుతుందన్న తలెత్తిన ప్రశ్ననుంచి జరిగిపోయి – పెడదారి పట్టిపోయినదే ఈ బ్లడీ మేరీ కథ.

మేరీ ఏమని బ్లాక్ మెయిల్ చేయాలి? డాక్టర్ హత్య కేసులో తన పేరు లేకుండా చేస్తే, సీఐ చేసిన హత్యా దృశ్యాలున్న కెమెరా సీఐ కిచ్చేస్తానని బ్లాక్ మెయిల్ చేయాలి.ఇలా కాకుండా అయిదు లక్షలిస్తే కెమెరా ఇస్తానని అంటుంది.ఆ డబ్బుతో లోకల్ మాఫియా శేఖర్ (బ్రహ్మాజీ) సాయం తీసుకుని బోటు నెక్కి పారిపోవాలని ప్లాన్ చేస్తుంది. తన మీద హత్యకేసు అలాగే వుంచుకుని!

సీఐ ప్రభాకర్ కూడా డాక్టర్ హత్య వూసే ఎత్తడు. డాక్టర్ హత్య ఇక కథలో ఎక్కడా ప్రస్తావనకి రాదు. మరి ఆ హత్య ఎందుకంటే, తన ఆశయ సాధనలో ఎవరడ్డు వచ్చినా వూరుకునేది లేదని చెప్పడానికే. ఆ ఆశయమేమిటో చెప్పదు. ఈ ఎలివేషన్ డాన్ గా ఎదగడం కోసమని మనకిప్పుడు అర్ధం గాదు.

ఎందుకంటే, ఇది క్రైమ్ డ్రామా అనే అనుకుంటాం. క్రైమ్ డ్రామా ఇలా నడుస్తోందేమిటాని అనుకుంటాం. ఇది క్రైమ్ డ్రామా జానర్ వదిలేసుకుని, ఫార్ములా మాఫియా కథగా మారిపోతోందని గ్రహించం ముగింపు చూసేవరకూ.

లేతపిల్ల మేరీ సీఐతో, లోకల్ డాన్ శేఖర్ తో ఎత్తుకు పైఎత్తులేసి చిత్తు చేస్తూ కమర్షియల్ యాక్షన్ హీరోలాగా సాగి సాగి కట్ చేస్తే – సడెన్ గా ఇంటర్నేషనల్ మాఫియా డాన్ గా ఎలివేట్ అయ్యే దృశ్యాలు. పీడిత జనం కోసం పెద్ద నాయకురాలు. పెద్ద బహిరంగసభ. ప్రత్యర్ధుల్ని అంతమొందించడం, ఎక్కడో ఒక దీవిలో పెద్ద బంగాళాలో నివాసం, హెలీకాప్టర్ వగైరా వగైరా వగైరాలతో – ఇక సీక్వెల్ – చాప్టర్ టూ రాబోతోందని హింట్ ఇస్తూ ముగింపు!!

ఇంత చిన్న బడ్జెట్ లో కేజీఎఫ్ అంతటి సినిమా చూపిస్తే, అదీ ఓటీటీలో 400 రూపాయలకి ఏడాది చందా స్కీములోనే మనం చూసేస్తే ఎంత అదృష్టం! ఒక్క కేజీఎఫ్ టూ చూడ్డానికే టికెట్టుకి 400 పెట్టాం కదా.

‘భామాకలాపం’ లాంటి రియలిస్టిక్ హోమ్లీ క్రైమ్ థ్రిల్లర్ అందించిన ఆహా నుంచి, సహజత్వానికి దూరంగా థియేటర్ సినిమా రావడం విచారకరం. దర్శకుడు చందూ మొండేటికి థియేటర్ సినిమా -ఓటీటీ మూవీ రెండూ ఒకటే అన్పించడంతో ఈ సమస్య.

—సికిందర్