టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైలులో ఉంటే దుబాయ్ సైమా అవార్డు ఫంక్షన్ కు వెళ్తాడా? కనీసం బంధుత్వం లేదా? అది లేదా ఇది లేదా అంటూ అవాకులు చెవాకులు పేలుతున్న వారు ఒక్క విషయం ఆలోచించాలి. పార్టీ పై వున్న అభిమానమో చంద్రబాబు పై వున్న ప్రేమో మిమ్మల్ని ఇలా మాట్లాడిస్తూ ఉండొచ్చు! మీ మనసు బాధ పడి ఉండొచ్చు!
నిజానికి ఎందుకు రావాలి? పార్టీ కి దూరం అయ్యాక మళ్ళీ ఎన్టీఆర్ వ్యతిరేకంగా లేదా ఇంకో రకంగా ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడలేదు! వైసీపీ అభిమానులు ఎన్టీఆర్ ను ఓన్ చేసుకుని టీడీపీ కి వ్యతిరేకంగా ఫ్లెక్సీ లు పెట్టినప్పుడు పెడుతున్నప్పుడు కూడా వ్యాఖ్యానించ లేదు. ఆయనకు అత్యంత ఆప్తులు ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీ పార్టీ మారినప్పుడు కూడా ఎన్టీఆర్ మాట్లాడలేదు! అసెంబ్లీ లో భువనేశ్వరి గురించి లోకేష్ పుట్టుక గురించి అసభ్యంగా మాట్లాడినప్పుడు చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి ఏడ్చినప్పుడు కూడా ఒక్క మాట ఆయన నోట రాలేదు! కుటుంబ సభ్యులు అంతా కలసి పరామర్శించినప్పుడు కూడా ఆయన రాలేదు! ఈమధ్య పురంధేశ్వరి నాయకత్వం లో రాష్ట్రపతి భవన్ లో నందమూరి తారక రామారావు స్మారక కాయిన్ విడుదల అప్పుడు కూడా రాలేదు! ఇప్పుడెందుకు రావాలి?
దుబాయ్ లో జరిగిన సైమా అవార్డు ఫంక్షన్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ తన జీవితం లో ఎన్నో ఒడి దుడుకులు! ఎన్నో కన్నీటి చుక్కలు! ప్రతి కష్టం లోనూ అభిమానులు మాత్రమే తోడుగా నిలిచారు. వారి ఋణం తీర్చుకోలేను అంటూ కంట తడి పెట్టుకున్నారు! ఎంత బాధ గుండెల్లో పెట్టుకుని ఉంటే “అభిమానులు మాత్రమే” అని నొక్కి పలికాడో అర్ధం చేసుకోవచ్చు!
కుటుంబ సమస్యలు మనం మాట్లాడుకోవడం సమంజసం కాదు కాబట్టి, నాకు చాలా వరకు విషయాలు తెలిసినా నేను ఇక్కడ చెప్పదలచుకోలేదు! కలుపుకు పోయిన ప్రతిసారి ఏదొక విధంగా మనసు గాయపడుతూనే వుంది! పురంధేశ్వరి నుంచి ఢిల్లీ కి పిలుపే లేదు! అందుకే తన తమ్ముడిని పిలవ లేదని హీరో కళ్యాణ్ రామ్ కూడా హాజరు కాలేదు!
లోకేష్ కు ఎన్టీఆర్ కు పోటీ లేదు, పోటీ కాదు! ఇద్దరూ కలిస్తే పార్టీ కి పెద్ద ఊతం! ఇది నిజం! కానీ, చాలా మంది అనుకున్నట్లుగా లోకేష్ స్థానానికి ఇబ్బంది రాకూడదనే ఉద్దేశ్యం తో ఎన్టీఆర్ ను పక్కన పెట్టారనేది నమ్మడం లేదు! లోకేష్ తెలివి గలవాడు! ఎన్టీఆర్ చరిష్మా కలిగిన వాడు! ఎన్టీఆర్ కు ఇండస్ట్రీ లో గొప్ప భవిష్యత్ వుంది! అందుకే ఆయన కెరీర్ పై దృష్టి పెట్టాడు! ఇంకో పదేళ్ల పాటు రాజకీయాల వైపు రాకూడదని నిర్ణయం తీసుకున్నాడు! అందుకే ఎన్టీఆర్ యూనివర్సిటీ ని వై ఎస్ ఆర్ యూనివర్సిటీ గా మార్చినా న్యూట్రల్ గానే వీడియో విడుదల చేసి విచారం వ్యక్తం చేశాడు!
వాళ్ళు వీళ్ళు ఎంత రెచ్చ గొట్టినా మౌనమే అతని సమాధానం! RRR ఆస్కార్ పురస్కారమే అతని కసి! ప్రతి సారి గెలుపు అందుకోవడం పైనే అతని దృష్టి! చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చి అందరి అభిమానాన్ని దూరం చేసుకోవడం అతనికి ఇష్టం లేదు! గతం లో ఎన్నికల్లో ప్రచారం చేసినప్పుడే అతనికి బాగా తెలిసి వచ్చింది! అదో పెద్ద గుణ పాఠం! అదృష్టవశాత్తు ప్రమాదానికి గురవ్వడం అతనికి జ్ఞానోదయం కలిగింది! హీరోగా కెరీర్ ముఖ్యం అనిపించింది! రాజకీయాలకు ఇంకా బోలెడంత టైం ఉందని తెలిసి వచ్చింది!
భవిష్యత్ లో ఏం జరుగుతుందో ఇప్పుడే ఏం చెప్పలేం! టీడీపీ లోకే రావాలని, తాత గారి పేరు నిలబెట్టాలని మనవడి కి ఉంటుంది! పరిస్థితులు కూడా అనుకూలించాలి! లోకేష్ ఎన్టీఆర్ కలసి పని చేసే రోజులు వస్తాయని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇలాగే దూరంగా ఉండాలని వైసీపీ అభిమానులు కోరుకుంటున్నారు! పురంధేశ్వరి ఎన్టీఆర్ ను బీజేపీ లోకి తీసుకెళ్లవచ్చు! లేదంటే, ఆమె కూడా ఎన్టీఆర్ ను కలుపుకుని భవిష్యత్ లో టీడీపీ పగ్గాలు చేపట్టవచ్చు! ఏమో ఏమైనా జరగవచ్చు! కుటుంబ సమస్య! ఎప్పుడైనా కలవొచ్చు! ఎప్పుడైనా విడిపోవచ్చు! కాబట్టి ఇప్పుడు ఎన్టీఆర్ రాలేదు అని తప్పు పట్టనక్కర లేదు! అంతే!