Hero Suman: తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత నాలుగు దశాబ్దాల నుంచి నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో సుమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇలా ఒకానొక సమయంలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుమన్ ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో సమావేశమైన విషయం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రితో సమావేశం కావడం కోసం పలువురు సినీ ప్రముఖులు వెళ్లారు. అయితే తనకు ముఖ్యమంత్రిని కలవాలని ఎవరి నుంచి ఎలాంటి ఆహ్వానం అందలేదని ఆయన తెలియజేశారు. ఒకవేళ అ ఆహ్వానం వచ్చినా రాకపోయినా తాను మాత్రం ఇండస్ట్రీలో బయ్యర్లు పడే ఇబ్బందులు గురించి ప్రస్తావిస్తానని ఆయన తెలియజేశారు. ఒకప్పుడు ఖరీదైన కార్లలో తిరిగే బయ్యర్లు నేడు ఎంతో దీనస్థితిలో మరణిస్తున్నారు. అలా దీన స్థితిలో మరణించిన వారికి సుమారుగా 5 మందికి తానే దహనసంస్కారాలు చేశానని సుమన్ వెల్లడించారు.
సినిమా ఇండస్ట్రీ బాగుండాలంటే సినిమా టికెట్లు రేట్లు, ఇతర విషయాల గురించి కాదు ముఖ్యంగా బయ్యర్లు బాగుండాలి వారు బాగున్నప్పుడే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది అంటూ సుమన్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఒక సినిమాను నమ్మి ఒక బయ్యర్ కోట్లలో ఆ సినిమాని కొనుగోలు చేస్తారు. ఆ సినిమా కనుక ఫ్లాప్ అయితే అతని పరిస్థితి గురించి ఎవరూ ఆలోచించరు ఇలా వారి పరిస్థితి ఆలోచించి వారికి తగిన సహాయం చేయడం వల్ల సినిమా ఇండస్ట్రీ బాగుంటుందని లేదంటే కొన్ని సంవత్సరాలకు నిర్మాతలే వారి సినిమాలను విడుదల చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని ఈ సందర్భంగా సుమన్ బయ్యర్లు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వెల్లడించారు.