ఈ ఏడాది సినిమా ఇండస్ట్రీకి ఏ మాత్రం కలిసి రాలేదు. ఒకవైపు కరోనాతో షూటింగ్స్ లేక చాలా మంది రోడ్డున పడగా, మరో వైపు ఎందరో లెజండరీ నటులు, సింగర్స్, కొరియోగ్రాఫర్స్, డ్యాన్సర్స్ తిరిగి రాని లోకాలకు వెళ్ళారు. వీరి మృతితో సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. తాజాగా ప్రముఖ గాయకుడు ఏసుదాసు కుమారుడు, నేపథ్య గాయకుడు విజయ్ యేసుదాసు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదంలో ఆయనకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఇటీవలే లెజండరీ సింగర్ బాలసుబ్రహ్మణ్య కరోనాతో కన్నుమూసిన సంగతి తెలిసిందే.
కేరళలోని కొచ్చి ప్రాంతంలో అర్ధరాత్రి విజయ్ కారుకు యాక్సిడెంట్ జరిగింది. జాతీయ రహదారిపై వస్తున్న విజయ్ కారుని మరో కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో రెండు కార్లు నుజ్జునుజయ్యాయి. అదృష్టవశాత్తు విజయ్ ఎలాంటి గాయాలు కాకుండా బయట పడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తిరువనంతపురం నుండి కొచ్చికి అర్ధరాత్రి సమయంలో వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తుంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో విజయ్ డ్రైవ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. విజయ్ కారు ఎదురుగా వచ్చిన మరో కారు అకస్మాత్తుగా దూసుకురావడంతో కంట్రోల్ కోల్పోయాడట విజయ్.
కారు ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని విచరణ చేపట్టారు. తప్పు ఎవరిది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదని తెలుస్తుండగా, అందరు సురక్షితంగా బయటపడడంతో సన్నిహితులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు ఊపిరిపీల్చుకున్నారు. విజయ్‌కి కాల్ చేసి క్షేమసమాచారాలు కనుక్కుంటున్నారు. విజయ్ కూడా తాను క్షేమంగానే ఉన్నట్టు ప్రకటించాడు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్న విజయ్ యేసుదాసు నాన్న మాదిరిగానే ఇండస్ట్రీలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తండ్రి మాదిరిగానే తనయుడి వాయిస్ ఉండటంలో అతనికి మంచి గుర్తింపు దక్కింది. మలయాళ సింగర్స్‌కు అంత గుర్తింపు రాని నేపథ్యంలో ఇటీవల తెలుగు, తమిళ సినిమాలకు కూడా పాటలు పాడతానని ప్రకటించారు విజయ్.