కరోనా మహమ్మారి సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఎంతో మంది ప్రమఖులని కబళించింది. ఇంకో పదిహేను సంవత్సరాలు బిందాస్‌గా బతుకుతారు అనుకున్నవారిని కూడా తిరిగిరాని లోకాలకు తీసుకెళ్ళింది. ఇప్పటికీ కరోనా ఉదృతి తగ్గకపోవడంతో చాలా మంది సీనియర్ నటులు భయాందోళనల మధ్య కాలం గడుపుతున్నారు. అయితే ఇటీవల ప్రముఖ బెంగాలీ నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత సౌమిత్ర ఛటర్జీ కరోనా బారిన పడగా, ఆయన ఆరోగ్యం రోజురోజుకు విషమిస్తుంది.
ఇరవై రోజుల క్రితం కరోనాతో ఆసుపత్రిలో చేరిన సౌమిత్ర ఛటర్జీని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వయోభారం, పలు అనారోగ్య సమస్యలు ఉండడం వలన ఆయనకి వైద్యం చేయడం కొంత కష్టతరంగా ఉందని వైద్యులు అంటున్నారు. ప్రస్తుతం ఆయన స్పృహలో లేరని, ప్లేట్‌లెట్స్ సంఖ్య గణనీయంగా పడిపోయిందని వారు స్పష్టం చేశారు. సౌమిత్రని బ్రతికించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నామంటున్న వైద్యులు రక్తంలో హెమోగ్లోబిన్ శాతం తగ్గడం వలన యూరియా, సోడియం స్థాయి విపరీతంగా పెరిగినట్లు వెల్లడించారు.
సౌమిత్ర ఛటర్జీకు ప్లాస్మా చికిత్స అందించడం తప్ప మరో మార్గం లేదని చెబుతున్న వైద్యులు కుటుంబ సభ్యుల ఆమోదం లభిస్తే వెంటనే వైద్యం మొదలు పెడతామని అంటున్నారు. ఆయన ఊపిరితిత్తులు, గుండె బాగానే పనిచేస్తున్నాయని, కానీ బ్రెయిన్ ఫంక్షనింగ్ సరిగా లేని కారణంగా న్యూరాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్ బోర్డు ఈరోజు సమావేశమై తదుపరి చికిత్స విధానాల గురించి చర్చించనున్నారని పేర్కొన్నారు. కోల్‌కతాలోని బెల్లే వ్యూ క్లినిక్‌లో ప్రస్తుతం సౌమిత్ర చికిత్స పొందుతుండగా, గతంలో ఆయన క్యాన్సర్ బారిన పడి కోలుకున్నారు. 85 ఏళ్ళ ఈ దిగ్గజ నటుడు కరోనా నుండి కూడా కోలుకోవాలని అభిమానులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు ప్రార్ధిస్తున్నారు.