కన్నడ హీరో ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం యూఐ. ఈ సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో మనందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు టీజర్లు, గ్లింప్స్ ఈ సినిమాపై భారీగా హైప్ ను క్రియేట్ చేశాయి. ఎప్పటికప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్లతో సినిమాలు తీస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న హీరో ఉపేంద్ర యూఐ సినిమాలో ఏం చూపిస్తున్నాడన్న ఆసక్తి ప్రస్తుతం ప్రేక్షకుల్లో ఉంది. చాలా రోజులుగా ఈ ప్రశ్న సోషల్ మీడియాలో వినిపిస్తుండగా ఎట్టకేలకు అభిమానులకు ఈ ప్రశ్నకు సమాధానం దొరికేసింది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు మూవీ మేకర్స్.. వార్నర్ అనే పేరుతో రిలీజ్ అయిన ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం ప్రపంచంలో చాలా సమస్యలు ఉన్నాయి. గ్లోబల్ వార్మింగ్, కోవిడ్ 19, ద్రవ్యోల్బణం, ఏఐ, నిరుద్యోగం, ప్రపంచ యుద్ధాలు వాటి పర్యవసానాలు ఇలాంటి ఘటనలు అన్ని కూడా ఈ సినిమాలో చూపించనున్నారు. టీజర్ లో ఈ సినిమా కథ 2040లో మొదలవుతుందని చూపించారు. మొత్తానికి 2040 కల్లా ఆహారం కోసం ఒకరిని ఒకరు చంపుకునే రోజులు రాబోతున్నట్లు టీజర్ చూస్తే ఇట్టే అర్థమవుతోంది.
ఇక విజువల్స్ చూస్తుంటే కేజీఎఫ్, సలార్ సినిమాలను తలపిస్తోంది. ఇక పెద్ద కారులో ఉపేంద్ర ఎంట్రీ ఇవ్వడం, చాలా మంది అతనికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం, ఆ వెంటనే ఉప్పీ గన్ తీసుకుని కాల్పులు జరుపుతూ మీధిక్కారం కంటే నా అధికారానికి పవర్ ఎక్కువ అని చెప్పడం హైలెట్ గా నిలిచింది. ఇకపోతే ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో 2040లో అసలు ఏం జరగబోతోంది? సినిమాలో ఇంకా ఏ అంశాలను జోడించారు అన్న అంశాలు ప్రతి ఒక్కరిలో ఆసక్తిని రేపుతున్నాయి. ఇకపోతే ఇప్పటికే అన్ని హంగులను పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 20 ప్రేక్షకుల ముందుకు రానుంది.