తనకు జరిగిన మేజర్ లివర్ సర్జరీ నిజంగా తన జీవితంలోనే ఒక విషాద పర్వం అని ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ అన్నారు. తనకు చాలా కాలం నుంచి మధుమేహం వ్యాధి ఉందన్న ఆయన, రొటీన్‌గా చేస్తున్న టెస్టుల్లో భాగంగా టెస్టు చేసినపుడు లివర్ ప్రాబ్లమ్ ఉన్నట్టు తేలిందని ఆయన చెప్పుకొచ్చారు. అది అప్పటికే సీరియస్‌గా ఉందన్న విషయం తనకు తెలియదని, తాను AIG కి వెళ్లిన తర్వాత అక్కడ డాక్టర్లు చూసి చాలా ప్రమాదకరమైన స్థితికి వచ్చారన్నారని ఆయన తెలిపారు. వెంటనే మీరు చికిత్స తీసుకోవాలని కూడా వారు చెప్పినట్టు ఆయన చెప్పారు.
ఆ తర్వాత తాను ట్రాన్స్‌ప్లాంట్ వరకు వెళ్లానని సుద్దాల అశోక్ తేజ అన్నారు. అది కూడా తన చిన్నబాబు ఇవ్వడం జరిగిందని ఆయన వివరించారు. అప్పుడు బయట దొరకక కాదు. నిజం చెప్పాలంటే తన ముగ్గురు పిల్లలు కూడా తనకు లివర్ డొనేట్ చేయడానికి ముందుకొచ్చారని ఆయన చెప్పారు. అయినా ఎవరో చనిపోతేనో, లేదా వేరే వాళ్లది దొరకాలంటే టైం కూడా పడుతుంది కదా, వాళ్లు ఇచ్చినా వాళ్లకు ఎలాంటి ప్రమాదం ఉండదని డాక్టర్లు చెప్పడంతో తాను ఆ నిర్ణయానికి ఓకే చెప్పానని ఆయన చెప్పారు.
ఇకపోతే డ్రింకింగ్ అలవాటు తనకు లేదు. కానీ ఏదైనా ఈవెంట్స్ అపుడు లైట్‌గా తీసుకుంటానన్న ఆయన, మరీ లివర్ పాడైపోయేంత అలవాటు మాత్రం తనకు లేదని ఆయన స్పష్టం చేశారు. కానీ నాన్ ఆల్కహాలిక్ వాళ్లకు కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుందట అని ఆయన అన్నారు. తన పిల్లలు అలా ఇస్తామనడం మాత్రం మానవ సంబంధాలు, కుటుంబ విలువల ద్వారానే వాళ్లకు ఆ ప్రవర్తన అలవడిందని అశోక్ తేజ చెప్పారు.