ఓటమెరుగని విక్రమార్కుడు రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ బాహుబలి చిత్రం చరిత్రను తిరగరాసిన సంగతి తెలిసిందే. ఎన్నో రికార్డులని చెరిపేసి తనపై ప్రత్యేక రికార్డును నమోదు చేసుకుంది. ప్రభాస్, రానా, అనుష్క, సత్యరాజ్, నాజర్ , తమన్నా ప్రధాన పాత్రలలో అత్యద్భుతంగా రెండు పార్ట్‌లుగా తెరకెక్కిన బాహుబలి మనదేశంలోనే కాక విదేశాలలోను విజయదుందుభి మ్రోగించింది. బాహుబలి సినిమా ఇందులో నటించిన చాలా మంది ఆర్టిస్టులకి ప్రత్యేక గుర్తింపుని తెచ్చిపెట్టింది.
తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన బాహుబలి సినిమాని చూడటానికి ఇప్పటికీ చాలా మంది ఇష్టపడుతుంటారు. సినీ ప్రేక్షకులే కాదు పలువురు ప్రముఖులు కూడా ఈ సినిమాని అమితంగా ప్రేమించారు. తైవాన్ (రిపబ్లిక్ ఆఫ్ చైనా) విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జోసెఫ్ వూ.. బాహుబలి సినిమాకు ఫిదా అయినట్టు ఓ ఛానెల్ డిస్కషన్‌లో పేర్కొన్నారు. బాహుబలి అంటే తనకు చాలా ఇష్టమని చెప్పిన తైవాన్ ఈ సినిమా టెలివిజన్‌లో వచ్చేటప్పుడు తన భార్యని ఛానెల్ మార్చొద్దని చెప్తారట. బాహుబలి సినిమా మళ్ళీ మళ్ళీ చూసేంత అద్భుతంగా ఉంటుందని అంటున్నారు జోసెఫ్.
బాహుబలి చిత్రాన్ని ఇప్పటికే లెక్కలేనన్నిసార్లు చూసానని చెప్పిన జోసెఫ్ ఇండియన్ సినిమాలంటే మక్కువ ఎక్కువ అని అంటున్నారు. అమీర్ ఖాన్ నటించిన దంగల్, హిందీ మీడియం చిత్రాలంటే కూడా తనకు ఇష్టమని చెప్పారు. ఏదేమైన బాహుబలి చిత్రం బాషలు, దేశాలకు అతీతంగా ఎంతో మంది ప్రేక్షకుల మనసులని గెలుచుకోవడం గొప్ప విశేషమని చెప్పాలి. బాహుబలి సీక్వెల్‌గా వచ్చిన బాహుబలి 2 చిత్రం చరిత్రను తిరగరాసింది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్నకు సమాధానమిస్తూ అందరికి మంచి వినోదాన్ని అందించింది. ఈ చిత్రానికి మరో సీక్వెల్ రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.