రవితేజ హీరోగా నీకోసం అనే సినిమాని తీసి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు శ్రీను వైట్ల. నేటితో ఆ సినిమా విడుదలై 25 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. దర్శకుడిగా ఇండస్ట్రీలో 25 సంవత్సరాల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న శ్రీను వైట్ల ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. డైరెక్టర్ కావాలని నేను చిన్నప్పటి నుంచే కోరుకున్నాను, అందుకోసమే చిన్న వయసులోనే చెన్నై వెళ్లాను. ఇండస్ట్రీలో నిలబడాలని తపన, సినిమా క్రాఫ్ట్స్ పై ఆసక్తి ఉండేది.
కానీ ఇంత పెద్ద సక్సెస్ అందుకుంటానని గాని, ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉంటానని కానీ ఆరోజు ఊహించలేదు. నా కెరియర్లో చాలా అద్భుతాలు జరిగాయి.ఈ 25వ సంవత్సరంలో కూడా విశ్వం లాంటి మంచి సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్ కి నా కృతజ్ఞతలు. నా ప్రయాణం పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. ఈ ప్రయాణంలో భాగమైన హీరోలు, నిర్మాతలు, టెక్నీషియన్లు, నా కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు అని చెప్పారు శ్రీనువైట్ల. నిజానికి 25 ఏళ్ళు అయింది అని మీరు అంటున్నారు కానీ నేను నమ్మలేకపోతున్నాను.
నేను ఇంకా ఇండస్ట్రీకి నిన్న, మొన్న వచ్చినట్లుగా అనిపిస్తుంది. నేను సాధించింది ఎక్కువ అనుకోవడం లేదు, ఇంకా మంచి సినిమాలు తీయాలని తపన బలంగా ఉంది అని చెప్పిన శ్రీను వైట్ల తన తొలి సినిమా అనుభవాన్ని చెప్పాడు. నీకోసం సినిమా కన్నా ముందే ఒక ప్రాజెక్ట్ ఆగిపోవడంతో డిసప్పాయింట్ లో ఉన్నా నాకు నా ఫ్రెండ్ రవితేజ బాగా ఎంకరేజ్ చేశాడు. అతని టాలెంట్ మీద నాకు నా టాలెంట్ పై తనకి చాలా నమ్మకం. అందుకే తక్కువ బడ్జెట్ లో అతనితో ఒక సినిమా తీయాలని అనుకున్నాను.
అలాగే సినిమా కూడా ప్రారంభించాము, కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్టు కూడా మధ్యలో ఆగిపోయింది కానీ రవితేజ ప్రోత్సాహంతో సినిమా ఫినిష్ చేశాను. ఈ సినిమా ఈనాడు రామోజీరావు గారికి బాగా నచ్చటంతో అవుట్రేట్ కి కొనేశారు. ఆయనే ప్రొడ్యూసర్ గా అందరికీ సెటిల్ చేసి సినిమాను తీసుకొని రిలీజ్ చేశారు. నిజంగా రామోజీరావు గారు వల్లనే ఆ సినిమా రిలీజ్ అయింది. ఈ సందర్భంగా ఆయనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, ఈ సినిమాకి 7 నంది అవార్డులు రావడం చాలా ఆనందంగా అనిపించింది అన్నారు శ్రీను వైట్ల.