తెలుగు సినిమా పాటల పూదోటలో విరిసిన పారిజాతపుష్పం సిరివెన్నల సీతారామశాస్త్రి. సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్న సీతారామశాస్త్రి చిన్నచిన్న పదాలతో అనితరసాధ్యమైన సాహిత్యాన్ని అందించారు. శాస్త్రీయ గీతమైనా…ప్రణయ గీతమైనా…సందేశాత్మక గీతాలైనా ..ఇలా ఏరకమైన గీతాలైనా ఆయన కలం నుంచి ఆశువుగా జాలువారుతాయి.తన పాటలతో అక్షర సేద్యం చేసే కవి కర్షకుడు సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇంట ఈ రోజు శుభకార్యం జరిగింది.
సిరివెన్నెల సీతారామశాస్త్రి కుమారుడు, నటుడు రాజా (రాజా భవాని శంకర శర్మ) వివాహం ఈ రోజు హైదరాబాద్‌లోని దస్‌పల్లా హోటల్‌లో ఉదయం 10.55 నిమిషాలకు జరిగింది. వైభవంగా జరిగిన ఈ వేడుకకు ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్, కృష్ణవంశీ, క్రిష్, గుణ్ణం గంగరాజు, వంశీ పైడిపల్లి, ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్,వెంకట్ అక్కినేని, రచయిత బుర్రా సాయిమాధవ్ తదితరులు విచ్చేసి నూతన వధూవురులని ఆశీర్వదించారు. ఎంతో గ్రాండ్‌గా జరిగిన రాజా, హిమబిందుల పెళ్ళికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.
రాజా చెంబోలు సహనటుడిగా ఎన్నో సినిమాలలో నటించారు. రాజా వెండితెరపై అలరించారు. చివరిసారిగా భానుమతి రామకృష్ణ మూవీలో నటించిన రాజా అంతకముందు అజ్ఞాతవాసి, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, హ్యాపీ వెడ్డింగ్, అంతరిక్షం, మిస్టర్ మజ్ను, రణరంగం, ఎవడు, ఫిదా వంటి చిత్రాలలో ముఖ్య పాత్రలు పోషించారు. ఫిదా చిత్రం రాజాకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. ఆగస్ట్‌లో వీరి నిశ్చాతార్ధం జరగగా, ఆ వేడుకకి సంబంధించిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేశారు రాజా.