గుణశేఖర్ దర్శకత్వం వహించిన “శాకుంతలం” సినిమా ఈ వారం పాన్ ఇండియా రేంజ్ లో విడుదలకు సిద్ధమైంది. సమంత ప్రధాన పాత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ పౌరాణిక చిత్రంపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇక ఈ చిత్రం ప్రీమియర్స్ ను ఇటీవల హైదరాబాద్‌లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో ప్రదర్శించబడింది. ఇంకా రిజల్ట్ విషయంలో పెద్దగా క్లారిటీ రావడం లేదు.
ఇక ఈ శుక్రవారం గ్రాండ్ పాన్-ఇండియన్ విడుదలకు సిద్ధమవుతున్న శాకుంతలం సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసిన తర్వాత U/A సర్టిఫికేట్ పొందింది. ఇక 142 నిమిషాల రన్‌టైమ్‌ను కలిగి ఉంది. ఈ చిత్రం ద్వారా మలయాళ నటుడు దేవ్ మోహన్ టాలీవుడ్ అరంగేట్రం చేస్తుండగా ప్రకాష్ రాజ్, మోహన్ బాబు, సచిన్ ఖేడేకర్, అదితి బాలన్, అనన్య నాగల్లా, గౌతమి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
అంతేకాదు ఈ సినిమాతో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ప్రిన్స్ భరతుడి పాత్రలో నటించింది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించగా, గుణ టీమ్ వర్క్స్‌పై గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ నిర్మించారు. ఎనిమిదేళ్ల విరామం తర్వాత, గుణశేఖర్ ఈ సినిమాతో సక్సెస్ అందుకోవాలి అనుకుంటున్నాడు.
కాళిదాసు రచించిన పురాతన సంస్కృత నాటకం “అభిజ్ఞాన శాకుంతలం” నుండి ప్రేరణ పొందిన “శాకుంతలం” ఈ సంవత్సరంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. మంత్రముగ్దులను చేసే విజువల్స్ గ్రిప్పింగ్ స్టోరీ టెల్లింగ్‌తో ప్రేక్షకులను ఆకర్షించడానికి సిద్ధంగా ఉందని చిత్ర యూనిట్ ఎంతో నమ్మకంగా చెబుతోంది. మరి సినిమా ఎలాంటి టాక్ అందుకుంటుందో చూడాలి.