Champion Movie Review: ‘ఛాంపియన్’ మూవీ రివ్యూ!

రచన- దర్శకత్వం : ప్రదీప్ అద్వైతం
తారాగణం : రోషన్ మేక, అనస్వరా రాజన్, మురళీ శర్మ, నందమూరి కళ్యాణ్ చక్రవర్తి, బలగం సంజయ్, రచ్చ రవి తదితరులు
సంగీతం: మిక్కీ జె. మేయర్ , ఛాయాగ్రహణం : ఆర్. మధి, కూర్పు : కోటగిరి వెంకటేశ్వరరావు
బ్యానర్స్ : ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిలిమ్స్, స్వప్న సినిమా
నిర్మాతలు : ప్రియాంకా దత్, జికె మోహన్, జెమిని కిరణ్
విడుదల : డిసెంబర్ 25, 2025

Champion Movie Review: హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ మేకా 2015 లో గుణశేఖర్ దర్శకత్వంలో ‘రుద్రమ దేవి’ తో బాల నటుడిగా వెండి తెరకి పరిచయమై, 2016 లో అక్కినేని నాగార్జున తో కలిసి నాగ కోటేశ్వరరావు దర్శకత్వంలో ‘నిర్మలా కాన్వెంట్’ లో హీరోగా ప్రేక్షకుల ముందు కొచ్చాడు. తర్వాత 2021 లో కే రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో, గౌరీ రోణంకి దర్శకత్వంలో ‘పెళ్ళి సందడి’ తో నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు. తర్వాత ఇప్పుడు 2025 లో ఇప్పుడు పీరియడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘ఛాంపియన్’ తో భారీస్థాయిలో యాక్షన్ హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకుంటూ క్రిస్మస్ సందర్భంగా విచ్చేశాడు. దీనికి ప్రదీప్ అద్వైతం కొత్త దర్శకుడు. ప్రముఖ నిర్మాతలు ప్రియాంకా దత్, జికె మోహన్, జెమిని కిరణ్ దీనికి నిర్మాణ బాధ్యతలు వహించారు. రోషన్ మేకా తెలంగాణా నేపథ్యపు కథతో స్పోర్ట్స్ యాక్షన్ హీరోగా ఆసక్తి రేపుతూ ప్రమోటవుతున్న ఈ మూవీ ఎలా వుంది? కొత్త దర్శకుడి ప్రతిభ రోషన్ ని నిలబెట్టే విధంగా వుందా, లేక మళ్ళీ రోషన్ కెరీర్ కి బ్రేకులేసే విధంగా వుందా ఈ క్రింద రివ్యూలో పరిశీలిద్దాం…

కథేమిటి?
1948 లో తెలంగాణా లోని భైరాన్ పల్లిలో నిజాం నుంచి విముక్తి పొందే సాయుధ పోరాటంలో ఒక ఫుట్ బాల్ క్రీడా పట్ల ఆసక్తిగల యువకుడు మైకేల్ (రోషన్) ఎలా వచ్చి ఇరుక్కున్నాడో, ఇరుక్కుని పోరాటంలో పోరాటంలో తను కూడా ఎలా పాల్గొన్నాడో తెలియజెప్పే కథ ఇది. తనకి లండన్ వెళ్లి అక్కడ టోర్న మెంట్ లో పాల్గొనాలన్న కోరిక. అయితే తన తండ్రి చేసిన ఒక పొరపాటు వల్ల తనకి లండన్ వెళ్ళే ఎనుమతి లభించదు. ఇల్లీగల్ గా వెళ్లేందుకు ఒక బృందం సాయ పడతామంటుంది. అయితే ఆ బృందం తరపున పోరాట వీరులకి ఆయుధాల్ని అందజేయాలని కండిషన్. దీనికి ఒప్పుకుని ఆయుధాలతో భైరాన్ పల్లికి వచ్చిన మైకేల్, అక్కడే పోరాటంలో ఇరుక్కుపోయి తను కూడా పోరాడాల్సి వస్తుంది… ఇదీ కథ.

ఎలావుంది కథ?
1948 లో తెలంగాణాలో నిజాం కాలపు చివరి రోజుల గూండాగిరీ, దీనికి వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటు, ఈ తిరుగుబాటులో భైరాన్ పల్లి కేంద్రంగా, కాల్పనిక ఫుట్ బాల్ క్రీడని జోడించి హిస్టారికల్ ఫిక్షన్ జానర్ లో చేసిన ఈ కథ, పైపైన రాసేసి పైపైన తీసేసే సినిమాల కింద జమవుతుంది. అందువల్ల విషయమున్నా ఇది భావోద్వేగాల్లేని, దృశ్యాలు అతికించుకుంటూ పోయిన అనాసక్తికర ప్రేలాపనగా, హీరో రోషన్ కి మరో విఫల ప్రయాసగా మిగిలిపోయింది.

ఈ సినిమా ఎక్కువగా మైఖేల్ (రోషన్) లండన్‌లో ఫుట్‌బాల్ ఆడాలనే కల గురించి వుంటే, అనుకోకుండా అతను నిజాం అణచివేతకి వ్యతిరేకంగా భైరాన్‌పల్లి తిరుగుబాటులో పాల్గొనాల్సి వచ్చే మొదటి మలుపు దగ్గర, ఇంపార్టెంట్ క్యారక్టర్ చేంజోవర్ ని దర్శకుడు మర్చిపోకుండా వుండుంటే, ఆద్యంతమూ ఈ సినిమా మైకేల్ మానసిక సంఘర్షణతో నిటారుగా నిలబడేది.

1946 నాటి హాలీవుడ్ క్లాసిక్ ‘ఇట్సే వండర్ఫుల్ లైఫ్’ (ఇది ఇప్పటికీ అమెరికాలో క్రిస్మస్ సినిమా) లో, హీరో జేమ్స్ స్టీవర్ట్ ఎదుర్కొనే పరిస్థితే మైకేల్ దీ. తండ్రి బ్యాకింగ్ బిజినెస్ లోకి రమ్మంటే వెళ్ళకుండా, ఆర్కిటెక్చర్ గా విదేశాల్లో ఆకాశ హార్మ్యాలు నిర్మించాలన్న కలలతో వుంటాడు. తీరా విదేశాలకి బయలుదేరే మొదటి మలుపు దగ్గర, తండ్రి హఠాన్మరణం అతడి కలల్ని కుప్పకూలుస్తుంది. ఇది గుండెల్ని మండిస్తూంటే, బ్యాంకింగ్ వ్యవహారాల్ని చేపట్టాల్సిన అగత్యంతో అతను పడే మానసిక సంఘర్షణ ఎలా తీరిందనేది మిగతా పకడ్బందీ ఎమోషనల్ డ్రామా. సేమ్ గోల్ రివర్సల్ సిట్యుయేషన్ మైకేల్ దీ. అతను ఇలాటి మానసిక- భౌతిక సంఘర్షణలతో కూడిన భావోద్వేగ బలంతో సినిమాని నిలేబెట్టే పరిపూర్ణ హీరో పాత్ర కాలేక పోయాడు.

దేశ స్వాతంత్ర్యానంతర నిజాం స్టేట్ లో రజాకార్ల అరాచకాలతో ఆసక్తికరంగా కథ ప్రారంభమవుతుంది. ఈ ఆసక్తికర సెటప్ తర్వాత బోరు కొట్టే కథ కొనసాగుతుంది. ఫస్టాఫ్ లో ఆకట్టుకునే, కూర్చోబెట్టే విషయం ఏమీ లేదు. ఈ పోరాట సంఘటనలు, సన్నివేశాలు వృధా అనిపిస్తాయి. పాత్రల పౌరుషాలు గానీ, వీరత్వం గానీ అరకొరగానే చూపించి వదిలేసిన వైనం కనబడుతుంది. ఇంటర్వెల్ వరకూ వరకూ ఇలాగే సాగుతుంది. మధ్యమధ్య నాటకాలు రచించి నిర్వహించే హీరోయిన్ తో హీరో లవ్ ట్రాక్ వస్తూంటుంది. ఇందులో కూడా ఫీలింగ్ వుండదు. తీరా ఇంటర్వెల్ కొస్తే, ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసిన పాయింటు కూడా పేలవంగా వుంటుంది.

హీరో రహస్యంగా ఆయుధాల్ని రవాణా చేస్తూ ఫుట్‌బాల్ గురించి కలలుగానే కొద్దిసేపు కథ డెప్త్ తో వుంటుంది. ఆ తర్వాత మళ్ళీ నిస్సారంగా మారుతుంది. ఇలా పోరాట సన్నివేశాలు, నాటక ప్రదర్శనలు, సబ్‌ప్లాట్‌లు పెద్దగా బావుండవు, ఫస్టాఫ్ లో ఒక పాట తప్ప చెప్పుకోవడానికి ఏమీ లేదు.


సెకండాఫ్ షరా మామూలే. హీరో క్యారక్టర్ తో కొన్ని సన్నివేశాలు తప్ప, మిగిలిన కథ క్లయిమాక్స్ సహా సీన్లు ఫ్లాట్ గానే వుంటాయి. దర్శకుడు భారీ కథని ఎత్తుకున్నాడు గానీ దాన్ని మోసే సత్తా లేకపోవడంతో మూవీ నిరాశాజనకంగా తయారయింది.

ఎవరెలా చేశారు?
రోషన్ ప్రధాన పాత్రలో కష్టపడి పనిచేశాడు గానీ పాత్రలో డెప్త్ లేదు. పైగా వయస్సు కూడా సరిపోలేదు. ఈ భారీ యాక్షన్ మూవీని తన లేత భుజాల మీద మోసే కెపాసిటీ లేదని సీన్స్ చూస్తూంటే తెలిసిపోతుంది. రొమాంటిక్ సినిమాకి సరిపోయే వయస్సు తనది. ఈ సినిమాలో తన పాత్రకు ఎమోషనల్ డెప్త్ అవసరం. దీన్ని పోషించే టాలెంట్ ఇంకా తనకి లేదు.

హీరోయిన్ అనశ్వరా రాజన్ నటన బాగుంది. అయితే ఆమెకి చెప్పిన డబ్బింగ్ ఎక్కడా బాగాలేదు. ఆమె పాత్ర కూడా తేలికైనది కావడంతో నటించడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు. నందమూరి కళ్యాణ్ చక్రవర్తి ఒక ప్రధాన పాత్ర పోషించాడు, కానీ ఇది కూడా అంతంత మాత్రం పాత్ర కావడం వల్ల అతడి నటన అంతగా రాణించలేదు. ఇక టాలెంట్ వున్న నటుడు కె.కె. మీనన్ కి ఓ చిన్న పాత్ర మాత్రమే దక్కింది.

సాంకేతికాలేమిటి?
ఈ సినిమాకి మిక్కీ జె. మేయర్ సంగీతం హైలైట్ అని చెప్పొచ్చు. . “గిరా గిరా గింగిరాగిరే” అనే హిట్ సాంగ్ తో బాటు మరికొన్ని పాటలూ బావున్నాయి. నేపథ్య సంగీతం ఓకే. కెమెరా వర్క్, ఇతర ప్రొడక్షన్ విలువలు, యాక్షన్ దృశ్యాలూ బ్రహ్మాండంగా వున్నాయి. వీటితో పోటీపడుతూ కంటెంట్ వుండాలి గానీ అదే లోపించడంతో యువ హీరో రోషన్ మేకాకి ఈ మూవీ బాగా మైనస్ అయింది.

రేటింగ్ : 2 /5

సీఎం పవన్ | Analyst Chinta Rajasekahar EXPOSED Pawan Kalyan Politics || Janasena | Nageswaramma |TR