IND vs ENG: రిషబ్ పంత్ గాయం నుంచి కోలుకుంటాడా.. 4వ టెస్ట్‌ ముందు టీమిండియాకు టెన్షన్..!

భారత్- ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ కీలక దశకు చేరింది. ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న ఇంగ్లండ్‌పై సిరీస్‌ను నిలబెట్టుకోవాలంటే భారత్‌కు మాంచెస్టర్‌లో జరగబోయే నాలుగో టెస్టు చాలా కీలకం. అయితే ఈ క్రిటికల్ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు రిషబ్ పంత్ గాయం కొత్త ఉత్కంఠ రేపుతోంది.

లార్డ్స్‌ టెస్టులో వికెట్ కీపింగ్ చేస్తూ ఎడమచేతి వేలికి గాయమై పంత్ మైదానం వీడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ధ్రువ్ జురెల్ కీపింగ్ బాధ్యతలు భుజాల మీద వేసుకున్నాడు. ఇప్పుడు నాలుగో టెస్టుకు ముందు పంత్ ఫిట్‌నెస్ సాధనలో మునిగిపోయాడు. ఫీల్డింగ్ డ్రిల్స్, ఫుట్‌బాల్, బ్యాటింగ్ ప్రాక్టీస్… అన్నీ చేసుకుంటున్నా, కీపింగ్ గ్లౌజులు ధరించిన పూర్తి వీడియోలు మాత్రం ఇప్పటి వరకు బయటకు రాలేదు. దీనితో అతని కీపింగ్ సామర్థ్యంపై సందిగ్ధత కొనసాగుతోంది.

భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోషేట్ కూడా ఇదే విషయాన్ని చెబుతూ, తాము పంత్‌ని దూరంగా ఉంచాలనుకోవడం లేదు. అతను మూడో టెస్టులోనూ గాయంతోనే ఆడాడు. కానీ కీపింగ్ చేయడం అనేది ఆఖరి పరీక్ష. ఎందుకంటే మ్యాచ్ మధ్యలో కీపర్ మార్చడం చాలా కష్టం అన్నారు. అంటే పంత్ గాయం పూర్తిగా తగ్గే వరకు జట్టు తుది నిర్ణయం తీసుకోబోదని ఇదే అర్ధం.

పంత్ కీపింగ్ చేయలేనిపక్షంలో కేఎల్ రాహుల్ లేదా ధ్రువ్ జురెల్ మరోసారి కీపర్‌గానే మైదానంలోకి దిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రాహుల్‌కు టెస్టుల్లో కీపింగ్ అనుభవం ఉంది. అదే జురెల్ మూడో టెస్టులో తాత్కాలికంగా కీపర్‌గా మెప్పించాడు. జులై 23 నుంచి మాంచెస్టర్‌లో బరిలోకి దిగనున్న నాలుగో టెస్టులో పంత్ చేతి గాయం ఎంతవరకు భరించగలిగిస్తుందో చూడాలి.

అతని సమర్థవంతమైన బ్యాటింగ్ మిడిల్ ఆర్డర్‌కు వెన్నెముక లాంటిది. పైగా, కీపింగ్ కూడా చేయగలిగితే జట్టుకు పూర్తి సమతుల్యత లభిస్తుంది. లేనిపక్షంలో జట్టు కూర్పులో మార్పులు తప్పవు. ఇప్పుడు అంతా పంత్ గాయంపైనే ఆధారపడి ఉంది. ఫంత్ ఫిట్ గా జట్టులోకి తిరిగి రావాలని భారత క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.