పదునైన మాటలు, గిలిగింతలు పెట్టే హాస్యంతో బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న యాంకర్స్ ప్రదీప్, రష్మీ గౌతమ్. వీరిద్దరు విడివిడిగా అనేక కార్యక్రమాలకు యాంకరింగ్‌లు వహించారు, అలానే కలిసికట్టుగా పాపులర్ షో ప్రాముఖ్యతని పెంచారు. సినిమా పరిశ్రమలోను అడుగు పెట్టిన ప్రదీప్ ఇటీవల 30 రోజులలో ప్రేమించడం ఎలా అనే సినిమా చేశాడు. ఈ సినిమా ఆడియో సూపర్ సక్సెస్ సాధించింది. కరోనా వలన ఈ చిత్ర రిలీజ్ వాయిదా పడింది. ఇక రష్మీ ఇంతక ముందు పలు చిత్రాలలో నటించగా, తాజాగా బొమ్మ బ్లాక్ బస్టర్ అనే చిత్రంలో నటించింది.
నూతన దర్శకుడు రాజ్ విరాట్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యంగ్ టాలెంటెడ్ హీరో నందు విజయ్ కృష్ణ, డస్కీ బ్యూటీ రష్మీ గౌతమ్ జంటగా నటిస్తున్నారు. ఇటీవల చిత్రానికి సంబంధించి విడుదలైన వీడియోలు నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. కట్ చేస్తే బుల్లితెర ప్రముఖ యాంకర్స్ ప్రదీప్, రష్మీ గౌతమ్ లు అరదైన ఘనత సాధించారు. ప్రముఖ బ్రిటన్ జర్నలిస్ట్ కిరణ్ రాయ్ ఇంటర్వూ చేసిన వాళ్ళలో 400 మంది స్పూర్తివంతులని ఎంపిక చేయగా, వారిలో ప్రదీప్ రష్మీ నిలిచారు.
కిరణ్ రాయ్ ఆసియాలోని భారత్, పాకస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలలో ప్రముఖుల జాబితాను సిద్ధం చేయగా, ఇందులో ప్రదీప్, రష్మీలకు చోటు దక్కడం విశేషం. ఇదే జాబితాలో ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ అగ్రస్థానంలో నిలవగా, సోనూ నిగమ్, రహత్ ఫతే అలీ, అద్నాన్ సమీ, జాకీర్ హుస్సేన్ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. ఇంత మంది ప్రముఖుల సరసన తాము నిలవడంపై ఆనందం వ్యక్తం చేశారు ఈ బుల్లితెర యాంకర్స్. మీ ప్రేమ, ఆదరాభిమానాల వలన ఇది సాధ్యమైందని ప్రదీప్ చెప్పుకొచ్చాడు. అయితే 400 మంది స్పూర్తివంతులలో భారత్ కు సంబంధించి 239 మంది ఉన్నారు.