సంక్రాంతి బరిలో కొత్త సినిమాలు.. తగ్గేదే ..లేదంటున్న నిర్మాతలు!!

సంక్రాంతి పండగ తెలుగు సినిమా ప్రేక్షకులకి ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ పండగకి తెలుగు సినిమాలు విడుదలవడం, ప్రేక్షకులు విపరీతంగా చూడటం, నిర్మాతలకి కాసుల వర్షం కురియడం పరిపాటి. అందుకనే సంక్రాంతికి మూడు నాలుగు సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. అయితే అవి విడుదలైనప్పుడు రెండు సినిమాలు ఒకే తేదీలో కాకుండా.. ఒక్కోరోజు ఒక్కో సినిమా విడుదలయేటట్టు చూసుకుంటారు. కానీ ఈసారి ఎక్కువ సినిమాలు, అదే ఒకటే రోజు రెండు సినిమాలు విడుదలవడంతో నిర్మాతలు తెలుగు ఫిలిం ఛాంబర్‌ లో సమావేశం నిర్వహించారు.

ఒకేరోజు అన్ని సినిమాలు విడుదల కాకుండా ఒకరోజు అటుఇటుగా విడుదల చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వచ్చింది. ఈ సమావేశం తెలుగు ఫిలిం ఛాంబర్‌ అధ్యక్షుడు దిల్‌ రాజు అధ్యక్షతన జరిగింది. సమావేశానికి నిర్మాతలు నాగవంశీ (గుంటూరు కారం), విశ్వ ప్రసాద్‌ (ఈగల్‌), శ్రీనివాస్‌ చిట్టూరి (నా సామి రంగ) హాజరు అయినట్టుగా తెలిసింది. ‘హనుమాన్‌’ నిర్మాత నిరంజన్‌ రెడ్డి ఈ సమావేశానికి రాలేదు, అతని కోసం ఒక అరగంటపాటు ఎదురుచూసినా అతను రాలేను అని చెప్పినట్టుగా సమాచారం.

అయితే ‘సైంధవ్‌’ నిర్మాత సెన్సారు కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతో దర్శకుడు శైలేష్‌ కొలను హాజరయినట్టుగా తెలిసింది. ఈ సినిమాలే కాకుండా ఇంకో రెండు డబ్బింగ్‌ సినిమాలు కూడా సంక్రాంతికి విడుదలవుతున్నాయి, కానీ ఇక్కడ తెలుగు సినిమాలకే ప్రాముఖ్యం ఇవ్వనున్నారు అని కూడా తెలుస్తోంది.

ఈ సమావేశంలో జనవరి 12న విడుదలయ్యే ‘గుంటూరు కారం’, ‘హనుమాన్‌’ నిర్మాతలని ఒకరోజు ముందుకు జరపాలని సూచించారని తెలుస్తోంది. ఎందుకంటే ఒకేరోజు రెండు సినిమాలంటే రెవెన్యూ పోతుంది అనే ఉద్దేశంతో చెప్పారు, ‘హనుమాన్‌’ నిర్మాతలు తమకి హిందీ భాషతో ఒప్పదం అయి పొయింది అందుకని ముందుకు జరగడం కష్టం అని చెప్పినట్టుగా తెలిసింది.

ఇక ‘గుంటూరు కారం’ నిర్మాతలు అలోచించి చెప్తాం అని అన్నట్టుగా తెలిసింది. ‘నా సామి రంగ’ నిర్మాత తమ సినిమా కథ సంక్రాంతి పండగ నేపథ్యంలో ఉంటుంది కాబట్టి, విడుదల వాయిదా వెయ్యడం కష్టం అని చెప్పారు. అయితే మిగతా సినిమాలన్నీ జనవరి 13, 14, 15 తేదీల్లో విడుదలవుతున్నాయి. మొత్తంవిూద ఈ సమావేశం చర్చలు అంత సానుకూలంగా జరగలేదనే చెప్పాలి.