సంక్రాంతి వచ్చిందంటే బరిలో పందెం కోళ్లే కాదు థియేటర్లలో సినిమాలు కూడా పోటీకి సై అంటాయి. ఎన్ని సినిమాలు వచ్చినా లాభాలు లెక్క పెట్టుకోవడమే అన్నట్లుగా కలెక్షన్స్ ఉంటాయి. అందుకే సంక్రాంతికి మించిన ముహూర్తం టాలీవుడ్ కి లేనేలేదు. అయితే నిజానికి ఈ సంవత్సరం పండగ బరిలో దిగే సినిమాలు తక్కువనే చెప్పాలి. అందులో కొన్ని సినిమాలు అయితే ఎప్పుడో రిలీజ్ అవ్వవలసినవి, అనివార్య కారణాల వలన వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఇప్పుడు రిలీజ్ కి సిద్ధం అయ్యాయి. జనవరి 10 తేదీన విడుదలవుతున్న గేమ్ చేంజర్ మూవీ ఎప్పుడో రిలీజ్ అవ్వవలసింది.
కానీ వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఈ పండక్కి విడుదల అవుతుంది. అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమా మాత్రం సంక్రాంతి రోజు రిలీజ్ చేయాలని పక్కా ప్రణాళికలతో అనుకున్న సమయానికే రిలీజ్ అవుతుంది. ఈ రెండు సినిమాలు దిల్ రాజు నిర్మాణంలోనే వస్తున్నాయి. తమిళ హీరోగా రూపొందిన విదాముయార్చి కూడా పండగ బరిలో దింపేందుకు చూస్తున్నారు మూవీ మేకర్స్. త్వరలోనే తెలుగు టైటిల్ ని రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తారని సమాచారం.
ఇక పండగలో ప్రధానంగా విడుదలవబోతున్న మూడు సినిమాలు సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్, గేమ్ చేజర్ మూవీలు మూడూ మూడు విభిన్న కథాంశాలతో వస్తున్నవే. ఒక కుటుంబ కథలోని క్రైమ్ కోణాన్ని ఆవిష్కరిస్తూ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమాలో భార్యకి ప్రియురాలికి మధ్య నలిగిపోయే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాడు వెంకటేష్.
గేమ్ చేంజర్ మూవీ అయితే రాజకీయ కోణాన్ని ఆవిష్కరించే కథ, ఇందులో రామ్ చరణ్ ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలోనూ ఒక రాజకీయ నాయకుడు పాత్రలోనూ కనిపించబోతున్నారు వీటితోపాటు మరో కోణం కూడా ఉంటుందని అది థియేటర్లోనే చూడాలని చెప్తున్నారు మూవీ మేకర్స్. ఇక బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమా అయితే ఒక కొత్త ప్రపంచాన్ని తెరపై ఆవిష్కరిస్తుందని దర్శకుడు బాబి చెప్తున్నాడు. చూడాలి మరి రేసులో ఏ పందెంకోడి గెలుస్తుందో.
