ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున విజయ్ శంకర్ ఆటతీరుపై విమర్శలు తారా స్థాయిలో వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 69 పరుగులు చేసినా, అతడి నెమ్మదైన బ్యాటింగ్ ట్రోలింగ్ కు దారి తీసింది. ఒకవైపు మ్యాచ్ గెలిచే అవకాశమున్న సమయంలో.. మిగతా బ్యాటర్లు వేగంగా ఆడినా, శంకర్ మాత్రం నెమ్మదిగా ఇన్నింగ్స్‌ను సాగించడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా అతడు 43 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేయడం అభిమానుల్ని విసిగించింది. అతడి ఇన్నింగ్స్ వల్ల చెన్నై అవసరమైన రన్ రేట్‌ను చేరుకోలేకపోయిందని, చివరికి ఓటమిని చవిచూసిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దీనికి తోడు ధోనీ కూడా స్లో బ్యాటింగ్ చేయడంతో మిడిల్ ఓవర్‌లలో స్కోరు గణనీయంగా పెరగలేదు. ఫలితంగా 25 పరుగుల తేడాతో చెన్నై ఓడిపోయింది.
ఇంకా, శంకర్ ఇన్నింగ్స్‌లో నాలుగు సార్లు ఢిల్లీ ఆటగాళ్లు క్యాచ్‌లు వదిలేయడం, క్లియర్ LBWకి కూడా రివ్యూ తీసుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. దాంతో సోషల్ మీడియాలో సెటైర్లు ట్రెండింగ్ అయ్యాయి. “విజయ్ శంకర్ అవుట్ అయితేనే చెన్నై గెలిచేదే.. అందుకే ఢిల్లీ ప్లేయర్లు కావాలనే ఆడనిచ్చారు” అంటూ ట్రోల్స్ పేలుతున్నాయి. అతని నెమ్మదైన బ్యాటింగ్‌ను లక్ష్యంగా చేసుకొని ఫన్నీ మీమ్స్ కూడా వైరల్ అయ్యాయి.
ఇదే 2019 వరల్డ్ కప్‌లో ‘3D ప్లేయర్’ అంటూ ఎంపికైన విజయ్ శంకర్, అప్పటినుంచి నిరంతరం తన స్థాయికి తగిన ఆటతీరు చూపలేకపోతున్నాడు. చెన్నైలో అవకాశం వచ్చినా, ఇదే పాత ఫార్మ్ కొనసాగించడంతో అభిమానుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. ప్రస్తుతం అతనిపై నెగటివిటీ పెరిగినప్పటికీ.. మళ్లీ ఫామ్‌లోకి వస్తే తప్ప తాను సరిచూపించలేనని స్పష్టంగా కనిపిస్తోంది. తదుపరి మ్యాచ్‌లలో శంకర్ ఎలా రాణిస్తాడో చూడాలి.