Rohit Sharma: మీరేంది స్వామి ఇంత ఘోరంగా ఉన్నారు.. రోహిత్ శర్మని దోచేశారుగా..!

ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ప్రయాణం క్వాలిఫయర్-2తో ముంగిసిన విషయం అందరికీ తెలిసిందే. పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమి చవిచూసిన హార్దిక్ పాండ్యా సేన, ఈసారి ఐపీఎల్ టైటిల్ గెలుచుకోవాలన్న ఆశను ఆవిరి చేసుకుంది. లీగ్ దశను నాలుగో స్థానంతో ముగించిన ముంబై.. టైటిల్ పోరులోకి ప్రవేశించలేక నిష్క్రమించింది.

అయితే ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం.. జట్టు ఆటగాళ్లు ఒక్కొక్కరుగా తమ గమ్యాలవైపు పయనమయ్యారు. అయితే వెళ్లే ముందు యువ ఆటగాళ్లు తమ అభిమాన సీనియర్ల వద్దకు వెళ్లి ఆటోగ్రాఫ్‌లు తీసుకున్నారు. సెల్ఫీలు దిగారు. మరికొందరు జెర్సీలు, బ్యాట్లు, కిట్లు అడిగి తీసుకున్నారు. ఈ క్రమంలో ముంబై జట్టు సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మకు చెందిన సంఘటన అభిమానుల మనసుల్ని తాకింది.

కొంత మంది యువ ఆటగాళ్లు రోహిత్ దగ్గరకు వచ్చి జెర్సీలపై ఆటోగ్రాఫ్ అడగగా.. మరికొందరు అతడి బ్యాట్లు కావాలంటూ కోరారు. తమ అభిమానం చూసిన హిట్‌మ్యాన్.. తానున్న మొత్తం ఆరు బ్యాట్లను వారికిచ్చేశాడు. తన కిట్ బ్యాగ్ ఖాళీ అయ్యేంత వరకూ ఇవ్వడంతో, అందరి ప్రశంసలు అందుకున్నాడు.

ఈ సందర్భానికి సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ అధికారికంగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆరు బ్యాట్లు ఇచ్చేశాను.. ఇప్పుడు నా వద్ద ఒక్క బ్యాట్ కూడా లేదు అంటూ రోహిత్ చెప్పిన మాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. నీది మంచి మనసు, లెజెండ్ రోహిత్ అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.