Betting APPs: బెట్టింగ్ యాప్స్ వెనుక ఏం జరుగుతోంది.. వాళ్ల ప్లాన్ ఎలా ఉంటుందంటే?

ఆన్‌లైన్ గేమ్స్ పేరుతో నడుస్తున్న బెట్టింగ్ మాఫియా ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద భూతంగా మారింది. ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకొని పెద్ద ఎత్తున మోసాలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో కేంద్రం తాజాగా స్పష్టత ఇవ్వడం కీలకం. కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటన ప్రకారం… ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ నియంత్రణకు అధికార బాధ్యత పూర్తిగా రాష్ట్రాలదే అని తెలిపారు. ఈ ప్రకటనతో రాష్ట్ర ప్రభుత్వాలు ఇక చురుకుగా వ్యవహరించాల్సిన అవసరం ఏర్పడింది.

బెట్టింగ్ యాప్స్ వెనుక వాస్తవంలో మాఫియా ఎలా పని చేస్తోందంటే, మొదట 50 లక్షల నుంచి 2 కోట్ల మధ్యలో యాప్స్ పై ఇన్వెస్ట్ చేస్తారట. ఆ తరువాత లేని కంపెనీలను సృష్టించి వాటిపై బ్యాంక్ ఖాతాలను ఓపెన్ చేస్తారు. ఉదాహరణకు ఒక చెప్పుల షాప్ లాంటిది. బెట్టింగ్ యాప్ లలో డబ్బు డిపాజిట్ చేస్తే సదరు చెప్పుల షాప్ అకౌంట్ లో పడతాయి. ఆ తరువాత బెట్టింగ్ యాప్ లో క్రెడిట్స్, డబ్బులు ఉన్నట్లు చూపిస్తారు.

మెల్లగా ఉచిత రివార్డ్స్‌తో కూడా యువతను ఆకర్షిస్తారు. ఆ తర్వాత “రెఫర్ చేయండి, రాయల్స్ పొందండి” అంటూ వాటి ద్వారా డబ్బులు పెట్టించేలా చేస్తారు. మొదట కొంత లాభం చూపించి, తరువాత పెద్ద మొత్తంలో పెట్టించిన తర్వాత ఒక్కసారిగా యాప్ మూసివేస్తారు లేదా గెలిచిన డబ్బు ఇవ్వరు. ఇక అత్యాశ కలిగించే చివరలో జాక్ పాట్ మిస్ అయినట్లు చూపిస్తారు. అదే ఆలోచన బలంగా పడేలా గేమ్ యాప్స్ ను డిజైన్ చేస్తారు. కొంచెం అయితే వందకు లక్ష రూపాయలు వచ్చేవనే ఫీలింగ్ కలిగించడం అసలు ప్లాన్. ఆ విధంగా అకౌంట్ లో డబ్బులు ఖాళీ అవుతాయన్న విషయం కూడా తెలియకుండా చాలామంది నష్టపోతున్నారు.

ఇదే మోడల్‌తో వేల కొద్దీ యాప్‌లు నడుస్తున్నాయి. కొంతమంది సెలబ్రిటీలను ప్రచారానికి వాడుతూ నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల హైదరాబాదు, చెన్నైలో జరిగిన ఘటనలు చూస్తే, చిన్న యువకులు లక్షల్లో నష్టపోయిన ఉదాహరణలు కనిపిస్తున్నాయి. కుటుంబాలే రోడ్డున పడే పరిస్థితులు వచ్చాయి. ఈ మాఫియా అంతర్జాతీయంగా పని చేస్తోంది. డబ్బులు ఇతర దేశాల్లోని అకౌంట్స్‌కు తరలించే వ్యవస్థ ఉన్నది. కొన్ని యాప్‌లు టోకెన్, క్రిప్టో రూపంలో డబ్బులు ఇన్వెస్ట్ చేయించడంలో మరింత ప్రమాదం ఉంది. దీనిపై ఇప్పటికైనా రాష్ట్రాలు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

కేంద్రం స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ, తమిళనాడు లాంటి రాష్ట్రాలు ఇప్పటికే చట్టాలు రూపొందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. కానీ ఇది కేవలం టెక్నికల్ నిబంధనలతో కాకుండా, మానవ జీవితాలను కాపాడే దిశగా ఉండాలి. సైబర్ పోలీసులు, టెక్నాలజీ నిపుణుల సమన్వయంతో ఈ బెట్టింగ్ మాఫియా మోసాల్ని ఛేదించాల్సిన సమయం ఇది. ప్రజల్లో కూడా అప్రమత్తత పెరగాల్సిన అవసరం ఉంది – ఎందుకంటే ఒక్క క్లిక్ తప్పు జీవితాన్ని మారుస్తోంది.

Ex Minister Kodali Nani Hospitalized : కొడాలి నాని కి హార్ట్ ఆపరేషన్..? |  Telugu Rajyam