Betting Apps: ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో బెట్టింగ్ యాప్ ల వ్యవహారం ఎంతటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. ఈ వ్యవహారంలో చాలామంది సెలబ్రిటీలపై కేసులు కూడా నమోదు అయ్యాయి. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ కోట్లకు కోట్లు సంపాదించారు. అయితే మొన్నటి వరకు సంచలనం రేపిన ఈ వ్యవహారం ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతోంది అనుకుంటున్నా నేపథ్యంలో మరోసారి ఈ విషయం తెరపైకి వచ్చింది. ఇది ఇలా ఉంటే ఇల్లీగల్ బెట్టింగ్ యాప్‌ల బండారం బట్టబయలు కాబోతోంది.
బెట్టింగ్ యాప్ వ్యవహారంలో రంగంలోకి దిగింది ఈడీ. హైదరాబాద్, సైబరాబాద్ లో నమోదైన కేసుల ఆధారంగా ECIR నమోదు చేశారు ఈడీ అధికారులు. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మంచులక్ష్మి, రానా, శ్రీముఖి, నిధి అగర్వాల్, ప్రకాష్‌రాజ్, అనన్య నాగళ్ల తో పాటు మొత్తం 29 మందిపై కేసు నమోదు చేసారు ఈడీ అధికారులు. బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ వ్యవహారంలో PMLA కింద కేసు నమోదు చేసిన ఈడీ ప్రముఖుల స్టేట్‌మెంట్ ను రికార్డ్ చేయనుంది. వీరంతా PMLA నిబంధనలు ఉల్లగించి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినట్టు ఈడీ అభియోగాలు మోపింది. నిషేధిత బెట్టింగ్ యాప్ లకు ప్రచారం చేసిన వ్యవహారంలో యాంకర్లు, టీవీ నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల నుంచి సినీ ప్రముఖుల వరకూ అందరిపై ఇప్పటికే తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు.
బెట్టింగ్ యాప్స్ కేసులో పలువురిని హైదరాబాద్ పోలీసులు విచారించిన విషయం తెలిసిందే. దీనిపై సిట్ ను కూడా ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. అయితే తాజాగా ఈ వ్యవహారంలోకి ఈడీ ఎంటర్ అవడం ఆసక్తి రేపుతోంది. హైదరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈ కేసులో ఈడీ దర్యాప్తు చేయనుంది. ఈ మధ్య కాలంలో ఈజీమనీ వేటలో అనేకమంది బెట్టింగ్ యాప్స్ కి బాగా అడిక్ట్ అవుతున్నారు. లక్కు కలిసి వస్తుందనే ఆశతో లక్షల రూపాయలు బెట్టింగ్ లకు తగలేస్తున్నారు. ఉన్నతోద్యోగుల నుంచి రోజు కూలీల వరకు, గృహిణుల నుంచి విద్యార్థుల వరకు చాలామంది ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసలవుతున్నారు. చివరకు లక్షల్లో కనిపిస్తున్న అప్పులను తీర్చే మార్గం కనిపించక మరోవైపు సొంతవారికి ముఖం చూపించ లేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. దీంతో ఇకమీదట ఇలాంటివి జరగకూడదు అనుకున్న ప్రభుత్వం బెట్టింగ్ యాప్ లో గట్టిగానే ఫోకస్ పెట్టింది.
