Betting Apps: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీని వెంటాడుతోంది. గత రోజులుగా టాలీవుడ్ సెలబ్రిటీలకు ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అయితే ఇందులో భాగంగానే విచారణకు రావాలంటూ దగ్గబాటి రానా, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి లకు తాజాగా ఈడీ నోటీసులను జారీ చేసింది. మరోవైపు మనీలాండరింగ్ విషయంలో గూగుల్, మెటాలపై ఈడీ కొరడా ఝళిపించింది.
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్, మనీ లాండరింగ్ వ్యవహారాలకు సంబంధించిన దర్యాప్తును ఈడీ అధికారులు స్పీడప్ చేశారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలకు నోటీసులు జారీ చేసిన ఈడీ, తాజాగా టెక్ దిగ్గజాలు గూగుల్, మెటాలకు కూడా సమన్లు పంపింది. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో గూగుల్, మెటాలను విచారించనుంది ఈడీ. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఎక్స్, షేర్‌చాట్, స్నాప్‌చాట్ ఇలా ఏ యాప్ ట్రెండింగ్ లో ఉంటే అందులో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశారు సెలబ్రిటీలు.
ఈ క్రమంలో విచారణలో భాగంగా గూగుల్, మెటాకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 23న విచారణకు రావాలని దగ్గుబాటి రానాను ఆదేశించింది. ఈ నెల 30న విచారణకు హాజరు కావాలని ప్రకాష్ రాజ్‌కు, ఆగస్టు 13న ఎంక్వైరీకి రావాలని మంచులక్ష్మికి నోటీసులు జారీ చేసింది. బెట్టింగ్ యాప్ లతో జరిగిన అగ్రిమెంట్లు, బ్యాంక్ ఖాతాల వివరాలు తీసుకుని రావాలని టాలీవుడ్ సెలబ్రిటీలను ఆదేశించింది. ఇక ఇదే కేసులో పేర్లున్న మిగతా నటీనటులకు సైతం దశలవారీగా సమన్లు జారీ చేయనున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. ఈ వ్యవహారంలో మొత్తం 29 మంది నటీనటులతో పాటు కంటెంట్ క్రియేటర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సలర్లపై విచారణ జరుగుతోంది.
Betting Apps: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు.. రానా, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మీలకు నోటీసులు
