Skype: ఒకప్పటి వీడియో కాల్స్ అడ్డా ‘స్కైప్’కు శుభం కార్డు!

ఒకప్పుడు వీడియో కాల్స్ అంటే అందరికీ గుర్తొచ్చే పేరు స్కైప్. కానీ ఇప్పుడు మారుతున్న టెక్నాలజీ, పెరుగుతున్న పోటీకి తట్టుకోలేకపోతున్నట్టు కనిపిస్తోంది. మైక్రోసాఫ్ట్ అధికారికంగా ప్రకటించనప్పటికీ, లేటెస్ట్ అప్‌డేట్ లో స్కైప్ సేవలను మే నుంచి నిలిపివేస్తున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇకపై మైక్రోసాఫ్ట్ పూర్తిగా టీమ్స్ కు మద్దతుగా నిలబడనున్నట్లు స్పష్టమవుతోంది.

స్కైప్ ప్రయాణం 2003లో ప్రారంభమైంది. 2011లో మైక్రోసాఫ్ట్ దాన్ని స్వాధీనం చేసుకుని పెద్ద ఎత్తున మార్పులు చేసింది. కానీ అనేక మార్పులు చేసినా, వినియోగదారుల ఆసక్తి తగ్గిపోయింది. విండోస్ 10లో దీన్ని ఇంటిగ్రేట్ చేసినప్పటికీ, కేవలం తొమ్మిది నెలలకే ఆ ప్రయోగం విరమించుకున్నారు. ఇక 2017లో మైక్రోసాఫ్ట్ టీమ్స్ లాంచ్ అయినప్పటి నుంచే స్కైప్‌పై గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. ఆఫీసు వాడకంలో టీమ్స్ ప్రాధాన్యత పెరిగింది. ఆ సమయంలోనే స్కైప్ భవిష్యత్తుపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి.

స్కైప్ నష్టానికి ప్రధాన కారణాలు గూగుల్, యాపిల్ వంటి దిగ్గజాల పోటీ మాత్రమే కాదు. మైక్రోసాఫ్ట్ విండోస్ ఫోన్ విఫలమవడం కూడా దీనిపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఇక, వినియోగదారులు వాట్సాప్, ఫేస్‌టైమ్, గూగుల్ మీట్ వంటి ఇతర యాప్‌ల వైపు మళ్లడం, స్కైప్‌ను మరింత బలహీనపరిచింది. చివరికి విండోస్ 11 వచ్చినపుడు కూడా స్కైప్‌కు ప్రాధాన్యత ఇవ్వకుండా టీమ్స్‌ను ముందుకు తీసుకురావడం స్పష్టమైన సంకేతమేనని అప్పటికే విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఎట్టకేలకు నిర్ణయం తీసుకుని, స్కైప్‌ను పూర్తిగా నిలిపివేస్తోంది. ఇప్పటికే కొంతమంది వినియోగదారులకు స్కైప్ మూసివేత గురించి నోటిఫికేషన్లు కనిపించాయి. ఇకపై స్కైప్ సేవలు పూర్తిగా నిలిపివేస్తే, వినియోగదారులు టీమ్స్ వైపే వెళ్లాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఒకప్పుడు అగ్రస్థానంలో నిలిచిన స్కైప్.. పోటీ ప్రపంచంలో నిలవలేకపోయిందనే చెప్పాలి.

Public Reaction On Ap Assembly Budget | Chandrababu, Pawan Kalyan || Ap Public Talk || YsJagan || TR