ఇటీవల టెక్నాలజీ రంగంలో ఉద్యోగాల కోతలు అనివార్యంగా మారాయి. గ్లోబల్ కంపెనీలు తమ వ్యయ నియంత్రణలో భాగంగా వేలాది ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా మైక్రోసాఫ్ట్ కూడా అదే బాటలో నడుస్తూ, 6 వేల మందికి పైగా ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ఆశ్చర్యకరం ఏమంటే.. వీరిలో ఎక్కువ మంది ఏఐ టెక్నాలజీపై పనిచేసే ఉద్యోగులే కావడం ప్రస్తుతం టెక్ పరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీసింది.
వాషింగ్టన్ ఆఫీసులో తొలగించిన ఉద్యోగుల్లో సుమారు 40 శాతం మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు. వీరంతా గతంలో సంస్థ సూచించినట్లుగా ఏఐ ఆధారిత టూల్స్ డెవలప్‌మెంట్‌లో కీలకంగా పనిచేశారు. ఓపెన్‌ఏఐ చాట్‌బాట్‌లను ఉపయోగించి కోడింగ్ వేగం పెంచాలని సూచించిన సంస్థే ఇప్పుడు అదే పనిలో ఉన్న వారిని తొలగించడం అనేక ప్రశ్నలకు దారితీస్తోంది. టెక్నికల్ మేనేజర్లు, ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ విభాగాలు ఈ కోతకు ఎక్కువగా గురయ్యాయి.
ఈ చర్యలపై మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు స్పందిస్తూ, సంస్థ నిర్వహణను సమర్థవంతంగా మార్చేందుకు మార్పులు తప్పనిసరని పేర్కొన్నారు. వ్యయాన్ని తగ్గించి, టెక్నాలజీ ప్రాధాన్యతను పెంచే దిశగా ముందుకెళ్లాలని తమ లక్ష్యమన్నారు. అయితే ఇదే సంస్థ గతంలో మరో 10 వేల మందిని తొలగించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జరిగిన కోత రెండో అతిపెద్ద దెబ్బగా గుర్తించబడుతోంది.
మొత్తంగా చూస్తే, తాము అభివృద్ధి చేసిన ఏఐ టూల్స్ వల్లే ఉద్యోగం పోయిన పరిస్థితే ఉద్యోగులకు ఎదురైంది. సీఈఓ సత్య నాదెళ్ల ఇటీవలే “30 శాతం కోడింగ్ ఏఐతోనే జరుగుతోంది” అని చెప్పిన మాటలు ఇప్పుడు నిజమవుతున్నాయని ఉద్యోగులు గుసగుసలాడుకుంటున్నారు. టెక్ రంగ భవిష్యత్తు ఇక ఉద్యోగులకు అనుకూలంగా ఉందా? లేదా..? అనేదే ఇప్పుడు అందరిలో కలకలం రేపుతోన్న ప్రశ్న.