దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈసారి కారణం జేఎన్.1 నుంచి ఉద్భవించిన కొత్త ఉపరకాలు ఎల్‌ఎఫ్.7, ఎన్బీ.1.5. ఇవి ఇప్పటికే సింగపూర్, హాంగ్‌కాంగ్‌లను కలకలం చేసిన తర్వాత ఇప్పుడు ముంబై, చెన్నై, అహ్మదాబాద్ నగరాల్లో వేగంగా వ్యాపిస్తున్నాయి. వీటికి వ్యాప్తి శక్తి ఎక్కువగా ఉండటమే ప్రధాన కారణం. అంతేకాదు, గతంలో వ్యాక్సిన్ తీసుకున్నవారిలో రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల కూడా వైరస్ సులభంగా విస్తరిస్తోంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ జేఎన్.1 వేరియంట్‌ను “వేరియంట్ ఆఫ్ ఇంటరెస్ట్”గా గుర్తించినా.. ఇంకా “వేరియంట్ ఆఫ్ కన్సర్న్”గా మాత్రం ప్రకటించలేదు. ఈ కొత్త వేరియంట్ల లక్షణాలు పెద్దగా భయపడాల్సినవి కావు. గొంతునొప్పి, జ్వరం, తేలికపాటి దగ్గు, అలసట వంటి సాదారణ లక్షణాలే కనిపిస్తున్నాయి. అయితే, డెల్టా టైంలో కనిపించిన రుచి, వాసన కోల్పోవడం వంటి లక్షణాలు ఇప్పుడు కనిపించడం లేదు.
చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నవారు మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. కర్ణాటకలో ముగ్గురు చిన్నారులకు ఈ వేరియంట్ సోకినా, ఎవరికీ ఐసీయూ అవసరం రాలేదు. ఢిల్లీ ప్రభుత్వంతో పాటు పలు రాష్ట్రాలు ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్, మందులతో అప్రమత్తంగా సిద్ధమవుతున్నాయి.
వైరాలజిస్ట్ డాక్టర్ టి. జాకబ్ జాన్ మాట్లాడుతూ, “ఇవి శ్వాసకోశం పైభాగానే ప్రభావం చూపించే వేరియంట్లు. భయపడాల్సిన అవసరం లేదు,” అన్నారు. పబ్లిక్ హెల్త్ నిపుణుడు డాక్టర్ సునీల్ ఖపర్డే కూడా “జాగ్రత్తలు తీసుకుంటే అంతగా ఎఫెక్ట్ ఉండదు,” అని తెలిపారు. మాస్క్ ధరించడం, హ్యాండ్‌వాష్ చేయడం, అనారోగ్యంగా అనిపిస్తే బయటకు వెళ్లకపోవడం వంటి ప్రాథమిక జాగ్రత్తలు పాటించడమే సరైన మార్గం అని సూచిస్తున్నారు. సరళమైన అలవాట్లతో వైరస్‌ను అదుపులో ఉంచవచ్చు.