తెలుగు సినిమా స్థాయిని పెంచిన స్టార్స్‌లో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. తన నటనతో పాటు డ్యాన్స్, స్టైల్, గ్రేస్‌తో ఎందరో అభిమానులని సంపాదించుకున్నారు. దాసరి మరణం తర్వాత తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలన్నింటిని పెద్దన్నలా సాల్వ్ చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఇటీవల చిరంజీవి కరోనా బారిన పడగా, ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఎటువంటి లక్షణాలు లేవని చెప్పిన చిరు ఎప్పటికప్పుడు తన ఆరోగ్యంకు సంబంధించిన అప్‌డేట్స్ ఇస్తా అని అన్నారు. కాని ఇంతవరకు ఒక్కటంటే ఒక్క అప్‌డేట్ కూడా ఇవ్వకపోవడంతో అభిమానులతో పాటు సెలబ్రిటీలలోను ఆందోళన నెలకొంది.
కొద్ది రోజుల క్రితం గుంటూరు,కృష్ణ, తూర్పుగోదావరి జిల్లాలలో చిరంజీవి అభిమానులు ఆంజనేయ స్వామికి పూజలు చేశారు. చిరు త్వరగా కోలుకోవాలని ప్రార్ధించారు. ఇక ఇప్పుడు నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడు లారెన్స్ .. చిరంజీవి కరోనా నుండి త్వరగా కోలుకోవాలని తన ఇష్టదైవమైన రాఘవేంద్ర స్వామిని వేడుకుంటున్నారు. అందుకు సంబంధించిన ఫొటోని షేర్ చేస్తూ.. శుభ గురువారం. మా గుడిలో అన్నయ్య కోసం ప్రత్యేక పూజ జరిగింది. చిరంజీవి అన్నయ్య త్వరలో కరోనాని జయించి పూర్తి ఆరోగ్యంతో బయటపడాలని ఆ స్వామిని వేడుకున్నాను అని తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు లారెన్స్.
లారెన్స్ ..చిరంజీవి నటించిన చాలా చిత్రాలకు కొరియోగ్రాఫర్‌గా పని చేశారు. ఇంద్ర సినిమాలోని దాయి దాయి దామ్మ అనే పాటకు లారెన్స్ అందించిన కొరియోగ్రఫీ ఇప్పటికీ ఎవర్‌గ్రీనే. ప్రస్తుతం దర్శకుడిగాను రాణిస్తున్న లారెన్స్ రీసెంట్‌గా సౌత్‌లో భారీ విజయం సాధించిన కాంచన చిత్రాన్ని హిందీలో లక్ష్మీబాంబ్ పేరుతో రీమేక్ చేశారు. టైటిల్ వివాదంలో చిక్కుకోవడంతో చిత్రం పేరుని లక్ష్మీగా మార్చారు. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. ఇక చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాతో బిజీగా ఉండగా, కరోనా నుండి కోలుకున్న తర్వాత తిరిగి షూటింగ్‌లో పాల్గొననున్నారు.