” ఇండియన్ 2 ” నుంచి టీజర్.. కమల్ బర్త్ డే సర్‌ప్రైజ్ అదేనా ..?

దాదాపు 23 ఏళ్ళ తర్వాత భారీ హిట్ కి సీక్వెల్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమానే ఇండియన్ 2. శంకర్ – కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన ఇండియన్ పెద్ద సంచలనం సృష్ఠించింది. తెలుగులో భారతీయుడు గా రిలీజైన ఈ సినిమా తెలుగు, తమిళంలో భారీ సక్సస్ అందుకోవడమే కాదు బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ సునామీని సృష్ఠించింది. కాగా ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ తెరకెక్కించే పనిలో ఉన్నాడు క్రియోటివ్ జీనియస్ శంకర్.

ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచే అన్ని అవాంతరాలు ఎదురవడం .. భారీ సెట్ కూలిపోవడం.. ఆ తర్వాత కరోనా కారణంగా దాదాపు 7 నెలలుగా చిత్రీకరణ ఆగిపోవడం అందరికీ తెలిసిందే. అంతేకాదు ఒక దశలో క్రియోటివ్ డిఫ్రెన్స్ వచ్చి ఏకంగా ప్రాజెక్ట్ ఆగిపోయిందని అన్నారు. కాగా ఇటీవలే మేకర్స్ అవన్నీ అవాస్తవాలని భారీ క్రూ తో తెరకెక్కాల్సిన సినిమా కాబట్టి ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా అనుమతులు కోరుతున్నట్టు వెల్లడించారు. అనుమతులు రాగానే యధావిధిగా ఇండియన్ 2 షూటింగ్ మొదలవనుందని తెలిపారు.

కాగా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన హాట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేమిటంటే ఈ నెల 7 న కమల్ హాసన్ బర్త్ డే సందర్భంగా భారీ సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్టు సమాచారం. ఆ రోజు ఇండియన్ 2 నుంచి కమల్ కి సంబంధించిన టీజర్ రిలీజ్ చేయనున్నట్టు లేటెస్ట్ న్యూస్. అదే జరిగితే ఫ్యాన్స్ చేసే రచ్చ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

కాగా కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ తో ఖైదీ లాంటి సూపర్ హిట్ సినిమా తీసిన లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించబోతున్నట్టు రీసెంట్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్ వచ్చే అవకాశాలున్నాయని సమాచారం. అలాగే గౌతం మీనన్ .. కమల్ తో ఒక సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తుండగా ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన అఫీషియల్ న్యూస్ కూడా నవంబర్ 7 న రానుందని తెలుస్తుంది.