2019లో అనుసరించిన వ్యూహాన్నే మునిసిపల్ ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ అమలు చేస్తోంది. అధికార పార్టీని ఎదుర్కోవాల్సింది పోయి, జనసేన పార్టీ మీద తన ప్రతాపం చూపిస్తోంది టీడీపీ. 2019 ఎన్నికల సమయంలో ‘జనసేన మా మిత్రపక్షమే..’ అని చాలామంది టీడీపీ నేతలు చెప్పుకున్నారు. కొన్ని చోట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫొటో పెట్టుకుని ఎన్నికల ప్రచారం చేశారు కూడా. అదే జనసేన పార్టీని దారుణంగా దెబ్బకొట్టింది. ఇప్పటికీ జనసేన, తెలుగుదేశం పార్టీతో తెరవెనుకాల సన్నిహితంగా వుందంటూ టీడీపీ అనుకూల మీడియా ప్రచారం చేస్తూనే వుంది. దాన్ని ఖండించేందుకు జనసైనికులు నానా తంటాలూ పడుతున్నారు. పంచాయితీ ఎన్నికల సందర్భంగా టీడీపీ వ్యూహాల్ని జనసేన సమర్థవంతంగా తిప్పికొట్టగలిగింది. అయితే, అవి పార్టీల గుర్తులతో సంబంధం లేకుండా జరిగిన ఎన్నికలు.
మునిసిపల్ ఎన్నికలు అలా కాదు. అందుకే, మళ్ళీ టీడీపీకి జనసేన అవసరం గట్టిగా వచ్చింది. తన ఉనికిని కాపాడుకోవడానికి జనసేనను పణంగా పెట్టడానికి టీడీపీ సిద్ధమయ్యింది. అయితే, జనసైనికులు సోషల్ మీడియా వేదికగా టీడీపీ తీరుని ఎండగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నం కొంతవరకు సత్ఫలితాలనిస్తున్నా మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా జనసేనకు వ్యతిరేకంగా వుండడంతో.. టీడీపీ వ్యూహాలు పలిస్తున్నాయి. ఏం చేసినా టీడీపీ, రెండో స్థానం కోసం ఆరాటపడాల్సిందే. పంచాయితీ ఎన్నికల్లో కొన్ని చోట్ల జనసేన తమను మూడో స్థానానికి నెట్టేసి, రెండో స్థానంలో నిలిచిందన్న అక్కసుతో మునిసిపల్ ఎన్నికల్లో ఈ అనైతిక వ్యూహాన్ని తెలుగుదేశం పార్టీ అమలు చేస్తోంది. జనసేన మాత్రం పోటీ చేసింది తక్కువ స్థానాల్లోనే అయినా, ఆ స్థానాల్లో తన ఉనికిని గట్టిగా చాటుకోవాలని భావిస్తోంది. జనసేన ఎంత ప్రయత్నించినా టీడీపీ వ్యూహాల నుంచి తప్పించుకోలేకపోతుండడం గమనించాల్సిన అంశం. టీడీపీ అంటేనే అంత.