ఇండియాకు ఆస్ట్రేలియా షాక్: ఫైనల్ కు వెళ్లడం సాధ్యమేనా?

ఆస్ట్రేలియాతో జరిగిన రెండవ టెస్ట్‌లో 10 వికెట్ల భారీ ఓటమి భారత జట్టును వెనక్కి నెట్టింది. అడిలైడ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలింగ్, బ్యాటింగ్ విఫలమవడంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో స్థానాలు కోల్పోయింది. 57.29 పాయింట్ల శాతంతో ఇప్పుడు భారత్ మూడవ స్థానానికి పడిపోయింది.

ఆస్ట్రేలియా ఈ విజయంతో 60.71 పాయింట్ల శాతంతో అగ్రస్థానాన్ని చేజిక్కించుకుంది. రెండవ స్థానంలో దక్షిణాఫ్రికా 59.26 పాయింట్లతో నిలవగా, భారత్ కంటే వెనుక శ్రీలంక 50 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే, భారత్ మిగిలిన మూడు టెస్ట్ మ్యాచ్‌ల్లో విజయం సాధించడం తప్పనిసరి.

ఇక పాయింట్ల సమీకరణం కఠినంగా ఉండడంతో దక్షిణాఫ్రికా విజయాలు భారత్ ఫైనల్ రేస్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. అదేవిధంగా, శ్రీలంక కూడా పాయింట్ల పట్టికలో తన పోటీని కొనసాగిస్తోంది. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో గెలిస్తేనే 64.03 పాయింట్లతో భారత్ రెండవ స్థానానికి చేరుతుంది. కానీ ఓటమి అయితే, ఫైనల్‌ రేస్‌ నుంచి టీమిండియా తప్పుకోవాల్సి వస్తుంది.

ఆస్ట్రేలియా కూడా బలమైన ప్రదర్శనతో మిగిలిన మ్యాచ్‌ల్లో గెలిస్తే ఫైనల్ చేరే అవకాశాలు మెరుగవుతాయి. మరోవైపు దక్షిణాఫ్రికా అన్ని టెస్టుల్లో గెలిస్తే 69 పాయింట్లతో తాము కూడా ఫైనల్‌కు చేరుతామని భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో భారత్, దక్షిణాఫ్రికా, శ్రీలంకల మధ్య పోటీ తీవ్రంగా సాగనుంది. భారత జట్టు మిగిలిన మ్యాచ్‌లను గెలిచినా, ఇతర జట్ల ఫలితాల మీద ఆధారపడి ఉండాల్సి రావడం అభిమానులకు నిరాశను కలిగిస్తోంది.