ఇంగ్లండ్ గడ్డపై జరుగుతున్న తొలి టెస్టు హోరాహోరీగా సాగుతోంది. లీడ్స్‌లోని హెడింగ్‍లీ మైదానం గట్టి పోరాటానికి వేదికైంది. మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ జట్టు 465 పరుగులతో భారత్‌పై ఒత్తిడి పెంచగా… గిల్ సేన రెండో ఇన్నింగ్స్‌లో మెరిసే ప్రయత్నం చేస్తోంది. మూడో రోజు ఆట ముగిసే సరికి భారత్ 23.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్ 96 పరుగుల ఆధిక్యంలో ఉంది. నాలుగో రోజు తొలి సెషన్ టర్నింగ్ పాయింట్‌గా మారే అవకాశముంది.
ఇంగ్లండ్ తమ మొదటి ఇన్నింగ్స్ లో 465 చేసింది. ఈ పరుగుల వెనుక హ్యారీ బ్రూక్ (99), జెమీ స్మిత్ (40), వోక్స్ (38) చేసిన పాత్ర కీలకం. దాదాపు శతకం వద్ద ఔట్ అయిన బ్రూక్ బ్యాటింగ్ అదిరిపోయింది. భారత్ పేస్‌దళం నుంచి బుమ్రా మరోసారి తన అగ్రస్థానాన్ని చాటాడు. 5/83తో ఇంగ్లండ్‌ను బ్రేక్ చేశాడు. అతనికి తోడుగా ప్రసిద్ధ్ 3, సిరాజ్ 2 వికెట్లు తీశారు. అయితే భారత ఫీల్డింగ్ మాత్రం నిరాశపరిచింది. ఏకంగా ఆరు క్యాచ్‌లు వదిలేయడం ఇంగ్లండ్‌కు అదనపు బూస్ట్ ఇచ్చింది. జైస్వాల్ మూడు క్యాచ్‌లు మిస్ చేయగా… బ్రూక్‌కు మాత్రమే రెండు లైఫ్స్ లభించాయి. ఓవర్ ఆల్‌గా ఫీల్డింగ్‌లో భారత్ క్లాస్ చూపలేకపోయింది. ఒక వేళ క్యాచులు పట్టి ఉంటే కథ వేరేలా ఉండేది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో మరో విశేషం ఏమిటంటే… బ్రూక్ ధాటిగా ఆడటం, స్లిప్స్‌లో క్యాచ్‌లు మిస్ అవ్వటం. భారత్ బౌలర్ల కంటే ఫీల్డర్లే ప్రత్యర్థికి ఎక్కువగా సహకరించారు.
భారత్ రెండో ఇన్నింగ్స్ ఆరంభించింది. యశస్వీ జైస్వాల్ తొందరగా వెనుదిరిగినా… కేఎల్ రాహుల్ (47 నాటౌట్), సాయిసుదర్శన్ (30) రెండో వికెట్‌కు 66 పరుగుల భాగస్వామ్యం ఇచ్చారు. అయితే సుదర్శన్ మరోసారి స్టోక్స్ బౌలింగ్‌లోనే ఔట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ శుభ్మన్ గిల్ (6*)తో రాహుల్ కొనసాగుతున్నాడు. ఇవాళ ఆరంభ సెషన్‌లో వీరు కీలకంగా నిలవాల్సిన అవసరం ఉంది.
బుమ్రా ఐదో వికెట్ తీసి ఇన్నింగ్స్‌ను ముగించడంతో భారత్‌కు 6 పరుగుల ఆధిక్యం లభించింది. అయితే ఇది మాత్రమే కాదు… అతడు టెస్ట్ కెరీర్లో 12వ ఫైవర్ సాధించి కపిల్‌దేవ్ రికార్డును బద్దలు కొట్టాడు. ఇప్పుడీ మ్యాచ్లో విజేతగా ఎవరు నిలుస్తారన్నది ఆసక్తికరమైన ప్రశ్న. భారత్ తుదివరకు చక్కటి ఇన్నింగ్స్ ఆడి ఇంగ్లండ్‌కు గట్టిపోటీ ఇవ్వగలిగితే టెస్ట్ భారత్ గెలిచే అవకాశం ఉంది. కానీ ఫీల్డింగ్ తప్పిదాలు అదే విధంగా కొనసాగితే గిల్ సేన ఆశలు గాల్లో కలిసే ప్రమాదమూ ఉంది.