ఆ హిట్టు సినిమాను పట్టించుకోరేంటి

ప్రస్తుతం బిగ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ తో పాటు ఒటీటీ ద్వారా కూడా కావాల్సినంత వినోదం ప్రేక్షకులకి అందుతోంది. చాలా కంపెనీలు ఒటీటీ ప్లాట్ ఫామ్స్ ని బిల్డ్ చేసి కొత్త కొత్త సినిమాలని రెండు, మూడు వారాల గ్యాప్ లోనే రిలీజ్ చేస్తున్నాయి. అలాగే వెబ్ సిరీస్ లు, డిజిటల్ ఫిల్మ్ లు చేస్తూ వస్తున్నాయి. ఇక థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలకి ఒటీటీలో కూడా ఆదరణ ఉంటుందని కోట్ల రూపాయిలు పెట్టి హక్కులని డిజిటల్ ఛానల్స్ వారు కొంటూ ఉంటారు.

అయితే ఈ మధ్య వివాదాస్పద కథలకి బిగ్ స్క్రీన్ పై డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా హిందూ, ముస్లిం మధ్య జరిగే గొడవలకి వాస్తవ రూపంగా వచ్చిన ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. చాలా మంది హిందువులు ఈ చిత్రం చూసిన తర్వాత కాశ్మీర్ లో పండిట్స్ ఊచకోత గురించి తెలుసుకున్నారు. అయితే ఈ సినిమా హక్కులని భారీ ధరకి అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్న ఆశించిన స్థాయిలో ఆదరణ రాలేదు.

తాజాగా ఇంచు మించు అలాంటి టచ్ తోనే లవ్ జిహాద్ కాన్సెప్ట్ తో ది కేరళ స్టొరీ మూవీ రిలీజ్ అయ్యి ఏకంగా 200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది కూడా అత్యంత వివాదాస్పదమైన చిత్రంగా నిలిచింది. కొన్ని రాష్ట్రాలలో బ్యాన్ కూడా చేశారు. అయితే బీజేపీ పాలిత రాష్ట్రాలలో పన్ను రాయితీ ఇచ్చారు. ఇంత పెద్ద హిట్ అయిన ది కేరళ స్టొరీ మూవీని ఒటీటీలో చూడాలని చాలా మంది అనుకుంటున్నారు.

అయితే డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ఏవీ కూడా ది కేరళ స్టొరీ మూవీని కొనడానికి ఆసక్తి చూపించడం లేదంట. ఇలాంటి కథలకి ఒటీటీలో ఆదరణ ఉండదని ది కాశ్మీర్ ఫైల్స్ తో క్లారిటీ వచ్చేయడంతో ది కేరళ స్టొరీ మూవీపైన మక్కువ చూపించడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఒటీటీ రిలీజ్ పై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు.

ఇదిలా ఉంటే ది కేరళ స్టొరీ టీమ్ ఇప్పుడు బస్తర్ అనే టైటిల్ తో మరో సినిమాని స్టార్ట్ చేశారు. నార్త్ ఇండియాలో బస్తర్ అనే ఏరియాలో జరిగిన రియల్ స్టొరీని సిల్వర్ స్క్రీన్ పై చూపించబోతున్నట్లు చెప్పారు. నక్సల్స్ నేపథ్యంలో ఈ మూవీ కథ ఉంటుందని టాక్ వినిపిస్తోంది.