కార్తికేయ 2 డైరెక్టర్ కి హ్యాట్సాఫ్… సినిమా పై ప్రశంసలు కురిపించిన పరుచూరి!

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ బ్లాక్ బాస్టర్ మూవీ కార్తికేయ 2 ఈ ఏడాది చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి అత్యధిక వసూళ్లతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ భారీ విజయాన్ని అందుకున్న విషయం మనందరికీ తెలిసిందే. కార్తికేయ 2 సినిమా దాదాపు 130 కోట్ల పైగా షేర్స్ సాధించి హీరో నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్‌లోనే గొప్ప మైలురాయిగా నిలిచింది. ఇంతటి ఘన విజయాన్ని అందుకున్న కార్తికేయ 2 సినిమా గురించి ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

కార్తికేయ 2 సినిమా విజయంలో యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, దర్శకుడు చందు మొండేటి పడిన కష్టం స్పష్టంగా కనిపిస్తోందని కష్టపడితే ఫలితం అంతకంటే గొప్పగా ఉంటుందని ఈ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ గారు హీరో, దర్శకులను అభినందించారు. ఈ సినిమాలో హంస, మురళి, కృష్ణుడి విగ్రహం వంటి పురాణ సంబంధమైన జానపద కథనీ సమకాలిక సాంఘిక కథగా మార్చి ప్రేక్షకులను మెప్పించడంలో దర్శకుడు చందు మండేటి సక్సెస్ అయ్యాడని ఆయన చెప్పారు.

కార్తికేయ 2 సినిమాలో అద్భుతమైన స్క్రీన్ ప్లే ప్రేక్షకులను ఆకట్టుకుంది. సాధారణంగా ఇలాంటి కథలతో వచ్చే సినిమాల్లో ప్రేమ సన్నివేశాలు ఉండవు. అయితే దర్శకుడు ఎంతో చక్కగా ప్రతి స్క్రీన్ లోను హీరో, హీరోయిన్లు కనిపించేలా చూసుకున్నాడు. అలాగే హాస్య సన్నివేశాలను కథకు అనుగుణంగా మార్చి హాస్యాన్ని పండించడంలో అద్భుతమైన స్క్రీన్ ప్లే రాసుకున్నారని దర్శకున్ని ప్రశంసించారు.

దర్శకుడు కష్టపడి రాసుకున్న కథలోని పాత్రలకు అనుగుణంగా నటీనటులను ఎన్నుకోవడంలో విజయం సాధించాడని చెప్పొచ్చు. ఈ సినిమాలో నటించిన వారందరూ వారి పాత్రలకు సమన్యాయం చేశారు. దర్శకుడు ఈ సినిమాలో కృష్ణ తత్వాన్ని కలియుగానికి అన్వయిస్తూ చూపించిన స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉందని, ఇంత గొప్ప సినిమాని ప్రేక్షకులకు అందించి అలరించినందుకు హీరో, దర్శకుడికి హ్యాట్సాఫ్‌ అంటూ పరుచూరి గోపాలకృష్ణ వీరిని అభినందించారు.