“ఇళ్లు కట్టివ్వపోతే నాగార్జున ఇంటికి వెళ్లి అడుగుతా”..గంగవ్వేంటి ఇలా మాట్లాడింది

బిగ్‌బాస్ తెలుగు సీజన్‌‌లో కంటెస్టెంట్‌గా గంగవ్వను తీసుకోవడం సంచలనం రేపింది. ఆమెకు ఉన్న ఫాలోయింగ్‌తో హౌస్‌కు కొంతమేర రేటింగ్ పెరిగింది. గంగవ్వ ఎలా ఆడిద్ది..అక్కడ ఉన్నవాళ్లతో ఎలా నడుచుకుంటుంది అన్న ఆసక్తితో చాలామంది షోను ఫాలో అయ్యారు. ఇంట్లో ఉన్నన్ని రోజులు మంచి వినోదం పంచిన గంగవ్వ అనారోగ్య పరిస్థితుల కారణంగా బయటకు వెళ్లింది. దాంతో ఒక్కసారిగా అభిమానులు, టీవీ ప్రేక్షకులు కాస్త డిసప్పాయింట్ అయ్యారు. కాగా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక గంగవ్వ చాలా ఇంటర్య్వూలు చేశారు. అయితే తాజాగా బిగ్‌బాస్ తెలుగు 2 విజేత కౌశల్ మండా ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా గంగవ్వ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

“బిగ్‌బాస్‌కు ముందు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు. పొలాల వెంట.. చెట్లు, పుట్టల వెంట తిరిగేదానిని. అయితే బిగ్‌బాస్ కోసం వెళ్లినప్పుడు నన్ను 21 రోజులు హోటల్‌లో ఉంచారు. క్వారంటైన్ పేరుతో ఎటు కదలకుండా, మెదలకుండా ఉంచారు. ఒక గదిలో ఉండటం వల్ల ఊపిరి ఆడని పరిస్థితి ఏర్పడింది. దాంతో నా ఆరోగ్యం దెబ్బతింది” అని గంగవ్వ చెప్పారు.

బిగ్‌బాస్‌ ఇంట్లోకి వచ్చాక తనలో సహనం పోయిందని, ఉత్సాహం తగ్గిపోయిందని ఆమె వెల్లడించారు. ఇక బిగ్ బాస్ ఇంటి వాతావరణం తనకు పడలేదని… ఏసీ ఎక్కువగా ఉండటంతో ఆరోగ్య సమస్యలు వచ్చాయని గంగవ్వ పేర్కొన్నారు. అక్కడి పరిస్థితులు కారణంగా.. రెండుసార్లు జ్వరం వచ్చిందని… డాక్టర్లు మంచి వైద్యం చేశారని వెల్లడించారు. ఇక తన రెమ్యూనరేషన్ గురించి కూడా ఆసక్తికర విషయాలు చెప్పారు గంగవ్వ.

“బిగ్‌బాస్ నాకు మంచిగా డబ్బులు ఇచ్చారు. వారం లెక్కన చెల్లించారు. వారానికి 2 లక్షల చొప్పున 5 వారాలకు రూ.10 లక్షలు ఇచ్చారు. నేను ఇల్లు కట్టుకోవాలని అనుకొంటున్నా కాబట్టి దానికి పది లక్షలు సరిపోవు. బిగ్ బాస్, నాగార్జున ఇళ్లు కట్టిస్తానని చెప్పారు. వారు మాట తప్పరు” అని గంగవ్వ తెలిపారు. ఒకవేళ ఇళ్లు కట్టించకపోతే నాగార్జున సార్ ఇంటికి వెళ్లి నిలదీస్తా అని సరదాగా వ్యాఖ్యానించారు గంగవ్వ. ఆయన తనను ఇంటికి కూడా రమ్మని చెప్పారని..మంచి మనిషని వెల్లడించారు. నాగార్జున సార్ సహాయం చేస్తే కొంత డబ్బు ఇళ్లు కొట్టుకోవడానికి, మరికొంత బంగారం కొనడానికి ఖర్చు పెడతానని…మిగిలినది దాచుకుంటానని గంగవ్వ వెల్లడించారు.