శీతాకాలం వచ్చిందంటే చాలు.. కూరగాయలు, దినుసులు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలని చాలా మంది ఫ్రిజ్‌పైనే ఆధారపడతారు. కానీ అదే ఫ్రిజ్ కొన్నిసార్లు మన ఆరోగ్యానికి నిశ్శబ్దంగా ముప్పుగా మారుతుందని పోషక నిపుణులు హెచ్చరిస్తున్నారు. చలికాలంలో తరచూ వాడే కొన్ని పదార్థాలను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల వాటి పోషక విలువలు తగ్గడమే కాకుండా, ఆరోగ్య సమస్యలకు దారితీయొచ్చని చెబుతున్నారు.
చలికాలంలో ఎక్కువగా ఉపయోగించే అల్లం ఇందుకు ప్రధాన ఉదాహరణ. జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందేందుకు అల్లం టీ తాగుతాం, వంటల్లో కూడా అల్లం తప్పనిసరిగా ఉంటుంది. అయితే చాలా మంది అల్లాన్ని ఫ్రిజ్‌లో నిల్వ చేస్తారు. ఇలా చేయడం వల్ల అల్లంపై బూజు త్వరగా పెరిగే అవకాశం ఉంటుంది. ఆ బూజు కనిపించకపోయినా, అల్లం లోపలే పాడవుతుంటుంది. తెలియకుండానే అటువంటి అల్లాన్ని వాడితే కాలేయం, మూత్రపిండాలపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.
అదే విధంగా ఆకుకూరల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ఆకుకూరలను కడిగి ఫ్రిజ్‌లో పెట్టడం తప్పు కాదు కానీ, రోజుల తరబడి నిల్వ చేయడం మాత్రం సరికాదు. 12 నుంచి 24 గంటల్లోపు వాటిని వండుకుని తినాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతకంటే ఎక్కువ సేపు ఉంచితే ఆకుకూరల సహజ రుచి తగ్గిపోతుంది, పోషక విలువలు కూడా క్రమంగా నశించటం ప్రారంభమవుతుంది.
చాలా మంది చేసే మరో పెద్ద పొరపాటు బంగాళాదుంపలను ఫ్రిజ్‌లో పెట్టడం. ఇది ఏ సీజన్‌లోనైనా ఆరోగ్యానికి హానికరమే. ఫ్రిజ్‌లో ఉంచినప్పుడు బంగాళాదుంపలలోని స్టార్చ్ చక్కెరగా మారుతుంది. దీంతో అవి త్వరగా మొలకెత్తడమే కాకుండా, డయాబెటిస్ ఉన్నవారికి మాత్రమే కాదు పిల్లలు, పెద్దలకూ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. టమోటాల విషయంలో కూడా శీతాకాలంలో ఫ్రిజ్ అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ఫ్రిజ్‌లో పెట్టిన టమోటాల రుచి పూర్తిగా మారిపోతుంది. వాటిలోని సహజ ఆక్సీకరణ లక్షణాలు నశిస్తాయి. మోస్తరు పండిన టమోటాలను బయట ఉంచితే వారం రోజుల పాటు తాజాగా ఉంటాయి. అందుకే అవసరమైనంత మాత్రమే కొనుగోలు చేసి బయటే నిల్వ చేయడం ఉత్తమం.
ఇవే కాకుండా కాలీఫ్లవర్, క్యారెట్లు వంటి కూరగాయలను కూడా చలికాలంలో ఫ్రిజ్‌లో ఉంచకపోవడం మంచిది. కాలీఫ్లవర్ ఫ్రిజ్‌లో ఉంటే పువ్వులు ముడుచుకుపోయి పోషకాలు తగ్గిపోతాయి. క్యారెట్లు అధిక చలితో దృఢత్వాన్ని కోల్పోయి రుచి మారుతుంది. అలాగే సిరప్‌లు, తేనె లాంటి ద్రవ పదార్థాలను కూడా శీతాకాలంలో ఫ్రిజ్‌లో ఉంచితే వాటి సహజ రుచి పూర్తిగా మారిపోతుంది. మొత్తానికి, ప్రతి పదార్థాన్నీ ఫ్రిజ్‌లో పెట్టడం మంచిదనే భావన తప్పని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా శీతాకాలంలో కొన్ని పదార్థాలను బయట సహజ ఉష్ణోగ్రతలోనే ఉంచడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతున్నారు.
