Actor Mukul Dev: బాలీవుడ్‌లో మరో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. హిందీ చిత్రాల్లో తనదైన శైలిలో మెప్పించిన నటుడు ముకుల్ దేవ్ (54) ఆకస్మికంగా మరణించారు. ‘సన్ ఆఫ్ సర్దార్’, ‘జై హో’, ‘ఆర్ రాజ్‌కుమార్’ వంటి హిట్ సినిమాల్లో కీలక పాత్రలు పోషించిన ముకుల్ దేవ్ మరణ వార్త సినీ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. శుక్రవారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సన్నిహితులు తెలిపారు. అయితే మరణానికి గల కారణాలు ఇంకా వెల్లడికాలేదు.
నటుడు రాహుల్ దేవ్‌కు సోదరుడైన ముకుల్, సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. నటి దీపశిఖా నాగ్‌పాల్ ఆయన మృతిని ధృవీకరిస్తూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయనతో దిగిన పాత ఫోటోను షేర్ చేస్తూ ‘RIP’ అంటూ నివాళి అర్పించారు. ముకుల్ చివరిసారిగా ‘అంత్ ది ఎండ్’ అనే చిత్రంలో కనిపించారు. ఆయన బాల్యం న్యూఢిల్లీలో గడిచింది. తండ్రి హరిదేవ్ పోలీస్ అధికారిగా పనిచేశారు.
ముకుల్ దేవ్‌కు బాల్యంనుండే కళలపై ఆసక్తి ఉండేది. ఎనిమిదో తరగతిలోనే డ్యాన్స్ షోలో పాల్గొని పారితోషికం అందుకున్నారు. మైఖేల్ జాక్సన్ స్టైల్‌లో డ్యాన్స్ చేసి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. పైలట్‌గా శిక్షణ పొందినప్పటికీ, నటనపైనే ఆసక్తి చూపారు. ‘ముమ్కిన్’ అనే టీవీ సీరియల్‌తో నటుడిగా అడుగుపెట్టారు. టీవీ షోలకు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించారు.
సినీ ప్రస్థానంలో ఆయన 1996లో వచ్చిన ‘దస్తక్’ అనే చిత్రంతో వెండితెర అరంగేట్రం చేశారు. ఇందులో ఏసీపీ రోహిత్ మల్హోత్రా పాత్రలో కనిపించారు. ఇదే సినిమాలో సుస్మితా సేన్ కూడా తొలిసారిగా నటించారు. ముకుల్ దేవ్ మృతి వార్తను విని బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.