ఆస్కార్ అమ్ముకోవచ్చా?? అమ్మితే ఎంత వస్తుందో తెలుసా?

సినీ ప్రపంచం మాత్రమే కాదు… ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక వేడుక.. ఆస్కార్‌ అవార్డుల ప్రకటన అయింది. ఆస్కార్‌కు ఓ తెలుగు సాంగ్‌ నామినేట్‌ అవ్వడంతో అందరూ ఆసక్తిగా ఎదురు చూడగా ఎట్టకేలకు నాటు నాటు సాంగ్ కు అవార్డు లభించింది.

నిజానికి ఈ ఆస్కార్‌ అవార్డును సినీ పరిశ్రమకు చెందిన వారంతా దీన్ని ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారం అని భావిస్తారు. అవార్డు అందుకోవడం పక్కన పెడితే నామినేట్‌ అవ్వడాన్ని కూడా చాలా గొప్పగా ఫీలవుతారు. ఒకరకంగా సినీ పరిశ్రమలో నోబెల్‌లా భావించే ఈ ఆస్కార్‌ అవార్డును కొంత మంది అమ్ముకున్నారు కూడా. ఒకవేళ అమ్మితే ఎంత వస్తుందో తెలుసా? కేవలం ఒక డాలర్ మాత్రమే అంటే 82 రూపాయలు మాత్రమే.

నిజానికి ఆస్కార్ అవార్డ్‌ చూడ్డానికి బంగారు రంగులో బంగారంతోనే చేసినట్టుగా కనిపిస్తున్నా వాస్తవానికి అది బంగారంతో చేసిన ఐడల్ కాదు. 30.5 అంగుళాల ఎత్తు, 4 కిలోల బరువుండే ఈ అవార్డు బొమ్మ రాగితో తయారు చేసి ఆపైన దానికి బంగారం పూత పూస్తారు. ఈ ఇక ఆస్కార్ అవార్డు తయారు చేసేందుకు 400 డాలర్లు ఖర్చవుతుందని అంచనా. ఇలాంటి అవార్డును కొందరు డబ్బు కోసం అమ్ముకోవడానికి చూస్తారు.

1950 ముందు ఓ అమెరికన్ డైరెక్టర్ తాను గెల్చుకున్న ఆస్కార్ అవార్డును వేలం వేయగా.. ఏకంగా ఆరున్నర కోట్లు వచ్చాయి, ఈ విషయం తెలిసి అకాడమీ అవార్డ్స్ కమిటీ భవిష్యత్తులో ఎవరు ఇలాంటి పని చేయకుండా ఉండేందుకు ఒక నిబంధన ప్రవేశపెట్టింది. దాని ప్రకారం ఒకవేళ ఎవరైనా తమకు వచ్చిన ఆస్కార్‌ అవార్డ్‌ను అమ్మాలనుకున్నా, వేలం వేయాలనుకున్నా లీగల్ గా కుదరదు. దాన్ని అకాడమీనే కొని 1 డాలర్ ఇస్తారు. ఇన్ని రూల్స్ ఉన్నా పలు సంధర్భాలలో పలువురు ఆస్కార్ అవార్డులు అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఇక ఆస్కార్ కమిటీ వారిని కోర్టు మెట్లు ఎక్కించింది కూడా.