RRR 2 పై జక్కన్న ఒకే ఒక్క క్లారిటీ.. నిజమవుతుందా?

లండ‌న్‌లో జ‌రిగిన ‘ఆర్ఆర్ఆర్’ మ్యూజిక్ కన్సర్ట్ ప్ర‌ద‌ర్శ‌న‌కు సంబంధించిన వీడియోలు ఇప్పుడు అభిమానుల మ‌ధ్య కొత్త ఊహాగానాల‌కు తావిస్తున్నాయి. రాయ‌ల్ ఆల్బర్ట్ హాల్ వేదిక‌గా నిర్వ‌హించిన ఈ ఈవెంట్‌లో రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌, ఎంఎం కీర‌వాణి, రాజ‌మౌళి స‌హా ప్ర‌ధాన బృందం అంద‌రూ కుటుంబ స‌భ్యులతో హాజ‌ర‌య్యారు. అంత‌ర్జాతీయ స్థాయిలో ఈ సినిమా సాధించిన గుర్తింపు నేపథ్యంలో, ప్రీమియ‌ర్ ప్రదర్శన భారీ స్థాయిలో క‌ల‌క‌లం రేపింది.

ఈ సంద‌ర్భంగా చ‌ర‌ణ్ సతీమణి ఉపాస‌న ఒక ఆస‌క్తిక‌ర వీడియోను షేర్ చేశారు. అందులో చ‌ర‌ణ్‌, తార‌క్‌లు రాజ‌మౌళిని ఆట‌ప‌ట్టించ‌డం, జ‌క్క‌న్న స్పంద‌న అంతా ఫ్యామిలీ మూడ్‌లో సాగింది. ఇదే క్రమంలో ఉపాసన అడిగిన ప్రశ్నే ఇప్పుడు హాట్ టాపిక్. “ఆర్ఆర్ఆర్ 2 చేస్తారా?” అన్న ఆమె ప్రశ్నకు జ‌క్క‌న్న త‌ప్పించుకోకుండా “అవును” అని సూటిగా జ‌వాబిచ్చారు. వెంట‌నే ఉపాస‌న ‘గాడ్ బ్లెస్ యు’ అని స్పందించ‌డం గ‌మ‌నార్హం.

జ‌క్క‌న్న స్పంద‌న ప్ర‌స్తుతం అభిమానుల‌ను రెండు మూడుగా విడ‌దీసింది. కొంద‌రు ఇది క‌చ్చితంగా ఆర్ఆర్ఆర్ సీక్వెల్‌కు సంకేతంగా చూస్తుండ‌గా, ఇంకొంద‌రు మాత్రం మామూలుగా జ‌రిగిన సరదా సంభాషణగా భావిస్తున్నారు. అయినా, దర్శకుడు స్వయంగా ‘అవును’ అన్న మాట వినిపించడంతో ఆశలు రెట్టింపయ్యాయి. మ‌రి ఇది నిజంగా ప్రాజెక్టుగా మారుతుందా? అని అభిమానులు సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు.

ఇప్ప‌టికే జ‌క్క‌న్న, మ‌హేష్ బాబు కాంబినేష‌న్‌లో వ‌రల్డ్ అడ్వెంచర్ ప్రాజెక్ట్ ప‌నుల్లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆ ప్రాజెక్ట్ త‌రువాతే ఇతర సినిమాల‌పై దృష్టి పెట్టే అవ‌కాశం ఉండ‌గా, అప్ప‌టికే తార‌క్‌, చ‌ర‌ణ్ లైన్‌లో ఉండ‌టం క‌ష్టం కాదు. అయితే రాజ‌మౌళి చెప్పిన ఆ ‘అవును’ మాటే నిజ‌మైతే.. మ‌ళ్లీ ఓ విశ్వ‌వ్యాప్త స్థాయిలో RRR2 సంద‌డి ఖాయం.