అలనాటి అగ్ర నటుడు సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరు అన్న విషయం తెలుగు చిత్ర పరిశ్రమ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతోంది. కృష్ణ అభిమానులు, తెలుగు ప్రజలు శోకసముద్రంలో మునిగిపోయారు. ఏదిఏమైనాప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమ బతికున్నంత వరకు కృష్ణ గారిని గుర్తు చేసుకొనే అంత విశిష్ట సేవ తెలుగు ఇండస్ట్రీకి చేశారని సగర్వంగా చెప్పవచ్చు. తెలుగులో 300 పైగా సినిమాల్లో నటించడం ఒక విశేషం అయితే సినిమా ఇండస్ట్రీకి నూతన సాంకేతిక వరవడిని పరిచయం చేయడం కృష్ణ గారికే సాధ్యం అయిందనేది జగమెరిగిన సత్యం.
తెలుగు ప్రజలకు ఇప్పటికీ అల్లూరి సీతారామరాజు, జేమ్స్ బాండ్, కౌబాయ్ అంటే అప్పటి తరం వారికి ఇప్పటి తరం వారికి గుర్తుకొచ్చేది కృష్ణ గారే. అంతటి ఖ్యాతిని సొంతం చేసుకున్న కృష్ణ గారు ఆంధ్రప్రదేశ్ లోనీ బుర్రిపాలెం లో జన్మించాడు. సినిమాలు మీద మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కృష్ణ గారు అనతి కాలంలోనే సూపర్ స్టార్ గా తెలుగు ప్రజల మన్ననలు పొందాడు. నటుడిగా నిర్మాతగా రాజకీయ నాయకుడిగా ఎన్నో విశిష్ట సేవలను అందించి తెలుగు ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచాడు.
సూపర్ స్టార్ కృష్ణ మొదటి సినిమా ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన తేనె మనసులు. ఈ సినిమా 1965 సంవత్సరంలో విడుదలై అద్భుత విజయాన్ని అందుకుంది. సూపర్ స్టార్ కృష్ణ మొదటి సినిమాతోనే తన నటన విశ్వరూపాన్ని తెలుగు ప్రజలకు పరిచయం చేశాడు. కృష్ణ గారు తన మొదటి సినిమా తేనె మనసులు సినిమాకు రెండు వేల రూపాయలు పారితోషకం తీసుకున్నానని చాలా సందర్భాల్లో స్వయంగా ఆయనే తెలియజేశారు. కృష్ణ గారికి మంచి పేరు వచ్చినప్పటికీ దాదాపు 30 నుంచి 40 సినిమాల వరకు కూడా పారితోషికం కేవలం 5000 రూపాయలు తీసుకొని నిర్మాతలపై ఆర్థిక భారం పడకుండా అప్పటి నిర్మాతలను బాగా ప్రోత్సహించాడని ఈ సందర్భంగా కృష్ణ గారిని తలుచుకొని ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు సినిమా ఇండస్ట్రీ పెద్దలు, అభిమానులు తెలుగు ప్రేక్షకులు.