గాజులు మహిళల చేతికి అందాన్ని ఇచ్చే ఆభరణం మాత్రమేకాదు.. ఆరోగ్యపరంగా, జ్యోతిషపరంగా, సంప్రదాయపరంగా కూడా గాజులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ మధ్యకాలంలో చాలామంది మహిళలు గాజులు పండగలు, పెళ్లిళ్లు, ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ధరిస్తున్నప్పటికీ, పండితుల మాటల్లో ప్రతిరోజూ గాజులు ధరించడం వల్ల అందం మాత్రమే కాదు, ఎన్నో రకాల లాభాలు పొందుతారని చెబుతున్నారు.
జ్యోతిష శాస్త్రం ప్రకారం గాజులు విలాసానికి, అందానికి కారణమైన శుక్ర గ్రహాన్ని బలపరుస్తాయని చెబుతారు. శుక్రుడు బలహీనంగా ఉంటే, ఆ వ్యక్తికి ఆర్థిక సమస్యలు, అందం, ఐశ్వర్యంలో సమస్యలు కలగొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే స్త్రీలు గాజులు క్రమం తప్పకుండా వేసుకుంటే శుక్రుడు బలపడి, వారి జీవితం విలాసవంతంగా మారుతుందంట.
ఇంతే కాదు, గాజులు ధరించడం వల్ల స్త్రీల చుట్టూ సానుకూల శక్తి ఏర్పడుతుంది. ప్రతికూల శక్తులు దరిచేరకుండా ఉంటాయి. ఇంట్లో ఉన్న మహిళలు గాజులు వేసుకుంటే అది కుటుంబానికి కూడా మంగళప్రదం. సాంప్రదాయం ప్రకారం, గాజులు లేకుండా మహిళలు తిరగడం అశుభంగా భావిస్తారు. అది వారి దాంపత్య జీవితాన్ని ప్రభావితం చేస్తుందని పెద్దలు చెబుతారు.
ఇదీ చదవండి: పూజా సమయంలో కొబ్బరికాయ ఎందుకు కొడతారో తెలుసా.. అసలు రహస్యం ఇదే..!
గాజులు భర్త శ్రేయస్సు, దంపతుల మధ్య అనుబంధానికి కూడా చిహ్నం. భార్య గాజులు ధరిస్తే అది భర్త ఆరోగ్యం, దీర్ఘాయువు కోసం ఒక రకమైన సంకేతం అని పెద్దలు విశ్వసిస్తారు. గాజులు దంపతుల మధ్య ప్రేమను మరింత పెంచుతాయని కూడా నమ్మకం ఉంది.
గాజులు కేవలం ఆధ్యాత్మికం, సంప్రదాయం వద్దే ఆగిపోవు. ఆరోగ్య పరంగా కూడా వీటి వల్ల ప్రయోజనాలున్నాయి. చేతుల మణికట్టు చుట్టూ గాజులు రుద్దుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది రక్తపోటును సరిచేసి, ఒత్తిడి తగ్గించడానికి ఉపయోగపడుతుంది. గర్భిణీ స్త్రీల విషయంలో గాజులు ధరించడం మరింత ఉపయోగకరం. ముఖ్యంగా 7వ నెల తర్వాత గాజుల శబ్దం గర్భంలో ఉన్న శిశువు మెదడు అభివృద్ధి చెందడానికి దోహదం చేస్తుందనే విశ్వాసం ఉంది. అదే సమయంలో తల్లికి కూడా ఈ శబ్దం సాంత్వన కల్పిస్తుంది. ఒత్తిడి తగ్గిస్తుంది, శాంతియుతంగా ఉంచుతుంది.
అందుకే, ప్రతి మహిళ గాజులు ధరించాలని చెబుతుంటారు. ఇది కేవలం ఆభరణంలా మాత్రమే కాకుండా శారీరక, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని కూడా పరిరక్షిస్తుంది. గాజులు కేవలం ఫ్యాషన్‌కి మాత్రమే కాదు… జీవితానికి కూడా అవసరమని చెప్పడానికి ఇదే ఉదాహరణ.