మన హిందూ సంప్రదాయంలో ప్రతి శుభకార్యం ముందు కొబ్బరికాయ కొట్టడం సర్వసాధారణం. కొత్తగా వాహనం కొనుగోలు చేసినా, ఇంటి గృహప్రవేశం చేసినా, దేవాలయంలో ప్రత్యేక పూజ చేసినా.. కొబ్బరికాయ తప్పనిసరి అవుతుంది. అయితే అసలు ఎందుకు కొబ్బరికాయనే కొడతారు.. ఈ ప్రశ్నకు సమాధానం చాలా మందికి తెలియదు.. పెద్దలు, పండితులు దీని గురించి ఏం అంటున్నారో ఈ కథనంలో తెలుసుకుందాం.
జ్యోతిష్య పండితుల మాటల్లో చెప్పాలంటే, కొబ్బరికాయ ప్రాణశక్తిగా పరిగణించబడుతుంది. ఇది జీవశక్తి, శుద్ధతకు ప్రతీక. సాధారణంగా కృత్రిమ వస్తువుల వల్ల అది సాధ్యం కాదు కాబట్టి.. సహజసిద్ధమైన ఫలాలు మాత్రమే పూజల్లో వాడతారు. కొబ్బరి కాయను పూర్ణ ఫలం అంటారు. నిమ్మకాయ, గుమ్మడికాయ వంటి వాటితోపాటు, కొబ్బరికాయకు ముఖ్య స్థానం దక్కింది.
ఇదీ చదవండి: గురువారం లక్ష్మీ, నారాయణులను ఇలా పూజిస్తే.. మీ ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగడం ఖాయం..!
పండితులు చెబుతున్న వివరాల ప్రకారం.. కొబ్బరికాయను మన శరీరానికి సమానంగా భావిస్తారు. బయట గట్టిగా ఉండే కవచం మన Ego, అహంకారానికి చిహ్నం. పూజలో కొబ్బరికాయ కొట్టడం అంటే అహంకారాన్ని త్యజించడం, మన ఆత్మను స్వచ్ఛంగా భగవంతుని పాదాలకి సమర్పించడం అని భావిస్తారు. కొబ్బరికాయపై ఉన్న తాడి భాగాన్ని తొలగించి, శుద్ధముగా చేసి పూజలో ఉంచడం జరుగుతుంది. ఇది మనలోని మలిన ఆలోచనలు, అహంకారం తొలగించి, పరిశుద్ధతతో దేవుడికి అర్పించడాన్ని సూచిస్తుంది. కొబ్బరికాయలోని నీరు మన మేధస్సు అది సమర్పించడం అంటే మనలోని జీవశక్తి మొత్తం భగవంతుని శరణు చేరుస్తున్నమని భావిస్తారు.
కొబ్బరికాయలో మూడు ‘‘కళ్ళు’’ ఉంటాయి అని మనకు తెలుసు. ఇవి త్రినేత్రం కలిగిన శివుడిని సూచిస్తాయి అని కొందరు విశ్లేషిస్తారు. కొబ్బరికాయలోని జలము మనలోని జీవజలమని కూడా ఒక విశ్వాసం ఉంది. కొబ్బరికాయను ‘‘శ్రీఫలం’’ అని కూడా పిలుస్తారు. శ్రీ అంటే లక్ష్మి సంపద, ఐశ్వర్యం. అందుకే కొత్త ఇంటి గృహప్రవేశం, కొత్త వ్యాపారం మొదలు, కొత్త వాహనం కొనుగోలు వంటి శుభకార్యాలలో మొదటగా కొబ్బరికాయను కొట్టి ఆరంభిస్తారు. ఇది ఆ పని ప్రతికూల శక్తుల నుండి రక్షణ పొందుతుందనే విశ్వాసం.
కొబ్బరికాయను కొట్టడం ద్వారా భగవంతుని పాదాల వద్ద మన కోరికలు సమర్పిస్తాం. ఇది ఒక త్యాగబుద్ధి. మన కోరికలు తీరాలి అని భగవంతుని కోరుతూ కొబ్బరికాయను మొక్కుతారు. కొబ్బరికాయ కొట్టడం కోరిక తీరిన తర్వాత కృతజ్ఞతగా చేయడం పవిత్రమని పెద్దలు చెప్పుతారు. అయితే మొదట కోరిక తీరితేనే కొడతా అనడం కంటే, ముందే విశ్వాసంతో కొట్టడం నిజమైన భక్తి అని పండితులు సూచిస్తున్నారు.
కేవలం కోరిక తీరుతుందనే కాదు.. భక్తి, కృతజ్ఞత, విశ్వాసం కలిస్తేనే కొబ్బరికాయ కొట్టడం సంపూర్ణంగా ఫలిస్తుంది. మనసు భక్తితో నిండినప్పుడు, ఈ చిన్న ఆచారం కూడా మన జీవితం మొత్తం సానుకూలంగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. అందుకే, కొబ్బరికాయ కొడితే కోరిక తీరుతుంది అనే ఉద్దేశంతో కాకుండా.. కృతజ్ఞతతో, భగవంతుని మీద గాఢమైన విశ్వాసంతో కొట్టమని పెద్దలు చెబుతున్నారు.