బిగ్ బాస్ 4: మోనాల్ మానియా.. దాసోహం అవుతున్న రికార్డులు

బిగ్ బాస్ ఇంట్లో మోనాల్ గజ్జర్ దూసుకుపోతుంది. ఇప్పటివరకు ఈ అమ్మడిపై ట్రోలింగ్ నడిచిన విషయం తెలిసిందే. కానీ ఈ వారం నామినేషన్ జరిగినప్పటి నుంచి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. బిగ్ బాస్ దత్త పుత్రిక అని తిట్టినవాళ్లే, ఇప్పడు ఈ ముద్దుగుమ్మ ఆట సూపర్ అంటూ పొగుడుతున్నారు. అంతేకాదు మెగా రికార్డులు కూడా ఆమెకు దాసోహం అంటున్నాయి.

బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టిన తొలి నాళ్లోనే కో కంటెస్టెంట్ సూర్య కిరణ్ తో గొడవ పడ్డ..కన్నీళ్ల వానను ప్రారంభించింది మోనాల్. అప్పట్నుంచి ఇప్పటివరకు మధ్యలో అడ్డుకట్టులు పడుతున్నాయి తప్పితే…కన్నీటి వరద మాత్రం ఆగడం లేదు. ఈ క్రమంలో వ్యాఖ్యాత నాగార్జున ఆమెకు నర్మదా నది అని కూడా పెట్టారు. ఎంట్రీ ఇచ్చినప్పుడే తాను చాలా ఎమోషనల్ అని చెప్పిన మోనాల్..కొన్ని సందర్భాల్లో అతి చేస్తోందన్న విమర్శలు ఎదుర్కొంది. ఆ తర్వాత ట్రయాంగిల్ లవ్ స్టోరీతో వీక్షకుల అటెన్షన్ గ్రాబ్ చేసింది. అభిజీత్-అఖిల్-మోనాల్ టాపిక్ కొన్నళ్లు తెలుగు టీవీలలో మారుమోగిపోయింది. ఇక్కడే మోనాల్ కిలాడీ అని కూడా కొందరు ఆరోపించారు. అలా..అలా ఇప్పటి వరకు బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో 12 వారాల పాటు గడిచిపోయింది. ఇన్ని వారాలలో చాలా నామినేషన్స్ లో ఉన్నప్పటికి.. ఎలిమినేషన్ తప్పించుకుంది. బిగ్ బాస్ రేటింగ్ కోసమే ఆమెను కాపాడుతున్నాడని నెటిజన్లు ఓ రేంజ్‌లో ట్రోల్ చేశారు. అంతేకాదు, ఆమె బిగ్ బాస్ దత్తపుత్రిక అంటూ హోరెత్తించారు.

ఈ వారం ఎలిమినేషన్ ఆసక్తికరంగా జరిగిన విషయం తెలిసిందే. టాస్కు మొదటి లెవల్‌లో సేవ్ అయిన మోనాల్.. కెప్టెన్ హారిక తీసుకున్న నిర్ణయంతో నాటకీయ పరిస్థితుల మధ్య నామినేట్ అయ్యింది. ఆ తర్వాత ఇమ్యూనిటీ దక్కే అవకాశం వచ్చినా, వినియోగించుకోలేకపోయింది. దీంతో ఈ వీక్ మోనాల్ ను బిగ్ బాస్ బయటకు పంపించక తప్పదు అని అందరూ అనుకున్నారు. కానీ, ఊహకు అందని విధంగా ఈ వారం ఓటింగ్‌లో ఎలిమినేషన్ జోన్‌లో ఉన్న అఖిల్ సార్థక్, అవినాష్‌, ఆరియానా గ్లోరీలను దాటి ఓటింగ్ లో మోనాల్ దూసుకుపోతోంది. అంతేకాదు, ఆమె ఈ వారం రికార్డు స్థాయిలో ఓట్లు సంపాదించినట్లు బిగ్ బిస్ టీమ్ ద్వారా తెలిసింది. ఈ వారం అభిజిత్ నామినేషన్లో లేడు. హారిక కూడా కెప్టెన్ కావడంతో ఇమ్యూనిటీ లభించింది. ఈ క్రమంలో అభిజిత్ నామినేషన్స్ నుంచి బయటపడటానికి పరోక్షంగా, హారిక కెప్టెన్ అవ్వడానికి ప్రత్యక్షంగా సాయం చేయడంతో.. వీరిద్దర్నీ అభిమానించేవారు ఆమెకు ఓట్లు వేస్తున్నారని తెలుస్తోంది. అందుకే దాదాపు నలభై శాతం ఓట్లు ఆమె ఒక్కదానికే పోలైనట్లు ఇన్ సైడ్ సమాచారం.