కోవిడ్ సమయంలో ఓటీటీ డీల్స్ భలేగా జరిగాయ్. ఆ తర్వాత అవి బాగా పెరిగాయ్. థియేట్రికల్ రైట్స్‌తో ఏం సంబంధం.? ఓటీటీ సంస్థలు క్యూ కట్టేస్తున్నాయ్.. అని నిర్మాతలూ విర్రవీగినంత పని చేశారు. అందరూ కాదులెండి, కొందరే.! కానీ, బుడగ పగిలిపోయింది.
ఓటీటీ సంస్థలు సవాలక్ష ఆంక్షలు పెడుతున్నాయ్. దాంతో, నిర్మాతలు పునరాలోచనలో పడిపోతున్నారు. దర్శకులూ అయోమయానికి గురవుతున్నారు. హీరోల సంగతి సరే సరి.! హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలకూ గడ్డు కాలమే కనిపిస్తోంది ఓటీటీ పరంగా.
వెబ్ సిరీస్‌ల జోరు తగ్గడానికి ఓటీటీ సంస్థలు వాటిపై పెద్దగా ఆసక్తి చూపకపోవడమే కారణమన్నది ఓ వాదన. గతంలో డీల్స్ ఓకే అయిపోయినవి కొన్ని ముందుకు సాగుతోంటే, డీల్ ఫైనలైజ్ అయిపోయినవాటిల్లోనూ కొన్ని బొక్కబోర్లా పడుతున్నాయ్.
అసలు విషయమేంటంటే, పెద్ద సినిమా అది.! నిజానికి, చాలా పెద్ద సినిమా.! పాన్ ఇండియా రేంజ్ ప్రాజెక్ట్.! ప్రముఖ నటుడి సినిమా కూడా.! సినిమా ప్రారంభానికి ముందే ఓటీటీ డీల్ చూచాయిగా ఓకే అయిపోయింది. కానీ, సినిమా షూటింగ్ ఓ కొలిక్కి వస్తున్న సమయంలో, ఓటీటీ సంస్థ మెలికలు పెడుతోందిట.
దాంతో, నిర్మాతకి బెంగ మొదలైంది. హీరో నుంచి నిర్మాతకి పూర్తి భరోసా లభిస్తున్నా.. పెట్టిన ఖర్చు నేపథ్యంలో నిర్మాత తల్లడిల్లిపోతున్నట్లు తెలుస్తోంది. పూర్తిగా డీల్ క్యాన్సిల్ అయ్యే పరిస్థితి లేదుగానీ, ముందు జరిగిన ఒప్పందాల కంటే చాలా తక్కువ అమౌంట్ కోట్ చేస్తున్నారట.
ఎందుకీ పరిస్థితి.? అంటే, మార్కెట్ డల్లుగా వుందనే మాట వినిపిస్తోంది. ఏంటా సినిమా.? అదైతే ప్రస్తుతానికి సస్పెన్స్.