ఆ వార్తలు నిజం కాదు.. అసలు నిజం చెప్పి షాకిచ్చిన ఆండ్రియా!

తెలుగు, తమిళం, మలయాళం భాషలలో ప్రముఖ నటీనటునతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఆండ్రియా తక్కువ సమయంలోనే మంచి పేరు తెచ్చుకుంది. తెరమీద ఆండ్రియా రెచ్చిపోయి రొమాన్స్ చేస్తుంది తన అందాల ఆరబోతలతో అభిమానులను కట్టుపడేస్తుంది ఈ నటి. సింగర్ గా సినిమాల్లోకి వచ్చి ఆ తర్వాత పచ్చైకిళి ముత్తుచ్చారం సినిమాతో హీరోయిన్ అయిన ఈ భామ మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి.

మంగత్త, విశ్వరూపం, తడాఖా, మాస్టర్, వడ చెన్నై లాంటి ఎన్నో సినిమాల్లో నటించి బహుభాషా నటిగా స్టార్ స్టేటస్ అందుకుంది. కెరియర్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడే సినిమాలకి దూరమైంది ఈ నటి. ఈమె లవ్ బ్రేకప్ అయిందని, డిప్రెషన్ లోకి వెళ్లిందని అందుకే సినిమాలకి దూరమైందని రూమర్స్ వినిపించాయి. తాజాగా ఆ రూమర్స్ కి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చింది నటి ఆండ్రియా. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె అనేక విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది.

తాను చివరిగా నటించిన సినిమా వడ చెన్నై అని ఆ సినిమా తర్వాత తనకి ఆటో ఇమ్యున్ స్కిన్ కండిషన్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని, ఈ వ్యాధి రావడం వలన కనుబొమ్మలు వెంట్రుకలు బూడిద రంగులోకి మారటం ప్రారంభించాయని చెప్పింది. రోజూ నిద్ర లేవగానే శరీరంపై ఎన్నో మచ్చలు కనిపిస్తాయి, రక్త పరీక్షలో ఈ వ్యాధి గుర్తించలేదు, ఈ పరిస్థితికి కారణం మానసిక ఒత్తిడి అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది.

తాను అనారోగ్య కారణాల వల్లనే సినిమాలకు దూరంగా ఉన్నానని, లవ్ బ్రేకప్ వల్ల కాదని క్లారిటీ ఇచ్చింది. ఈ వ్యాధికి సంబంధించిన మచ్చలు ఇంకా శరీరంపై ఉన్నాయని, ఇప్పటికీ తన కనురెప్పలు తెల్లగా ఉన్నాయని, ఈ వ్యాధి నుంచి కోలుకోవడానికి ఆమెకి ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ చాలా మేలు చేసిందని చెప్పుకొచ్చింది ఆండ్రియా. ఈ వ్యాధి నుంచి ఆమె త్వరగా కోలుకోవాలని, మళ్లీ మంచి సినిమాలతో ప్రేక్షకుల ముందుకి రావాలని ఆశిస్తున్నారు ఆమె అభిమానులు.