చిరకాల కల నెరవేర్చిన ఆర్సీబీ జట్టు విజయాన్ని జరుపుకునేందుకు బెంగళూరు ప్రజలు రోడ్డెక్కారు. కానీ విజయోత్సాహం విషాదాన్ని మిగిల్చింది. చిన్నస్వామి స్టేడియం వద్ద ఏర్పాటైన సన్మాన కార్యక్రమంలో తలెత్తిన తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రమైన గాయాలతో చికిత్స పొందుతున్నారు. మొత్తం 13 మందికి గాయాలైనట్టు అధికారులు వెల్లడించారు.
ఆర్సీబీ జట్టు తొలి ఐపీఎల్ టైటిల్ గెలుచుకుని బెంగళూరుకు తిరిగొచ్చిన నేపథ్యంలో నగరమంతా సంబరాల వాతావరణంలో నిండిపోయింది. విమానాశ్రయానికి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్వయంగా వచ్చి జట్టుకు ఘన స్వాగతం పలికారు. ఆటగాళ్లు బస్సు ఎక్కి విధాన సౌధకు వెళ్లిన సమయంలో నగరంలో వేలాది మంది అభిమానులు జెండాలతో, నినాదాలతో రోడ్డులపైకి వచ్చారు.
ఈ సందర్బంగా సాయంత్రం కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన చిన్నస్వామి స్టేడియంలో సన్మాన వేడుకకు లక్షల మంది అభిమానులు తరలివచ్చారు. స్టేడియం గేట్లు మూసి ఉండటంతో భద్రత గోడలు దాటి లోపలికి చొరబడేందుకు కొందరు ప్రయత్నించారు. గేట్-2 వద్ద పెద్ద ఎత్తున జనసందోహం ఏర్పడటంతో ఒక్కసారిగా తొక్కిసలాట తలెత్తింది.
పోలీసులు లాఠీచార్జి చేసినా, పరిస్థితిని అదుపులోకి తెచ్చేలోపే బీభత్సం జరిగిపోయింది. కొందరు అభిమానులు గోడలపై నుంచి కింద పడి గాయపడ్డారు. స్థానిక అధికారులు, వైద్య సిబ్బంది హుటాహుటిన స్పందించి ఆసుపత్రులకు తరలించినా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన గాయాలైనవారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ ఘటన నేపథ్యంలో సిటీ పోలీసు అధికారులు, కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే విచారణకు ఆదేశించగా, క్రికెట్ అసోసియేషన్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల భద్రత పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడమే ఈ విషాదానికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. విజయాన్ని ఆనందంగా జరుపుకోవాల్సిన వేళ ఓ వేదనగా మిగిలిపోవడం బాధాకరం.