ఐపీఎల్ 2025లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు సంబంధించి ఒక్కసారిగా ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఆ జట్టు మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలేను పోలీసులు అరెస్ట్ చేయడం ఇప్పుడు క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన ముంబై వెళ్లేందుకు బెంగళూరు విమానాశ్రయానికి వచ్చిన సమయంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్ట్ అప్పుడే జరిగిన బెంగళూరు స్టేడియం తొక్కిసలాట ఘటనపై నమోదైన కేసులో భాగమని సమాచారం.
ప్రముఖ ఈవెంట్‌కు సంబంధించిన ఏర్పాట్లలో ఏర్పడిన అవ్యవస్థితి, ప్రేక్షకుల భారీ రద్దీకి తగిన ఏర్పాట్లు చేయకపోవడం వల్ల జరిగిన తొక్కిసలాటకు సంబంధించి ఇప్పటికే ఒక ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీకి చెందిన ఇద్దరిని పోలీసులు విచారిస్తున్నారు. తాజా పరిణామంగా ఆర్సీబీ అధికార ప్రతినిధిని అరెస్ట్ చేయడం పరిస్థితికి మరో మలుపు తెచ్చింది. నిఖిల్ సోసాలేపై ఈ ఘటనలో పాత్ర ఉందని అనుమానిస్తూ పోలీసులు రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారని సమాచారం.
ఇప్పటివరకు ఆర్సీబీ యాజమాన్యం ఈ ఘటనపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం. అలాగే నిఖిల్ కుటుంబ సభ్యులు కూడా స్పందించలేదు. అయితే అభిమానులు మాత్రం తమ అభిమాన జట్టు ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించకూడదని, అవసరమైన క్షమాపణలు, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది కేవలం మేనేజ్‌మెంట్ లోపమా? లేక ఇంకా లోతైన కుట్రలా అన్నది విచారణ అనంతరం తెలుస్తుంది.
ఇకపోతే బెంగళూరులో జరిగిన ఈ తొక్కిసలాట ఘటనపై ఇప్పటికే విచారణ వేగంగా సాగుతోంది. ఈ ఘటనతో అభిమానుల భద్రతపై మరిన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక నిఖిల్ అరెస్ట్ కేసు ఎలా పరిణమిస్తుందనేది, ఆర్సీబీ నిర్వాహకులపై ఎలాంటి చర్యలు పడతాయన్నదీ ఆసక్తిగా మారింది.