బెంగళూరు నగరం ఐపీఎల్ టైటిల్ మొదటిసారి దక్కించుకున్న సంబరాల్లో మునిగిపోయిన రోజే, ఊహించని విషాదాన్ని చూసింది. చిన్నస్వామి స్టేడియం వద్ద నిర్వహించిన ర్యాలీ అనుకోని విషాదానికి దారితీయగా, 11 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. అభిమానుల హర్షధ్వానాలు ఒక్కసారిగా అరుపులుగా మారాయి. ఆ జ్ఞాపకం ఆర్సీబీ విజయాన్ని మరిచిపోయేలా చేసింది.
ఈ ఘటనలో బాధితులకు సానుభూతి తెలిపిన ఆర్సీబీ యాజమాన్యం, సోషల్ మీడియా ద్వారా రెండు వాక్యాల ప్రకటన చేసింది. కానీ దీనికి మాతృసంస్థ అయిన డయాజియో మాత్రం పూర్తిగా మౌనం వహించడం ప్రస్తుతం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో కార్యకలాపాలు నిర్వహించే ఈ కంపెనీ, భారత్‌లో తమ జట్టు విజయాన్ని బ్రాండ్‌ల ప్రచారానికి వాడుకుంటూ, బాధితుల విషయంలో నిర్లక్ష్యం చూపుతుండటం గమనార్హం.
ఘటనపై మీడియా, సామాజిక మాధ్యమాల్లో తీవ్రంగా స్పందన వస్తున్నా, డయాజియో ఎటువంటి హామీ, ఆదరణ ప్రకటించకపోవడం వల్ల బాధిత కుటుంబాల్లో ఆగ్రహం ఉధృతమవుతోంది. ‘‘తమ పేరును విజయ సందర్భంలో వాడుకుంటారు, కానీ బాధితుల దగ్గరికి మాత్రం రావడం లేదు’’ అంటూ పలువురు విమర్శిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన అవ్యవస్థపై పూర్తి వివరాలు వెల్లడించకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది.
ఈ ఘటన నేపథ్యంలో ఆర్సీబీ గెలుపుకే మచ్చ పడినట్లైంది. విజయానికి కారణమైన అభిమానులే అసౌకర్యానికి గురవుతుంటే, అసలైన వారే స్పందించకపోవడం బాధాకరం. ఇప్పటికైనా డయాజియో స్పందించాలనే ఒత్తిడి పెరుగుతోంది. లేకుంటే ఇది కంపెనీ పీఆర్‌కు భారీ నష్టంగా మారే అవకాశం ఉంది.