మిజోరం రాష్ట్రంలోని భక్తవంగ్ గ్రామంలో నివసిస్తున్న ప్రపంచంలోనే అతి పెద్ద కుటుంబ యజమాని 76 ఏళ్ల జియోనా చానా ఆదివారం మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణంపై మీజోరాం సీఎం జోరమ్‌తంగా సైతం ట్వీట్ చేసి సంతాపం తెలిపారు. భక్తవంగ్ కే కాకుండా రాష్ట్రానికి కూడా పర్యాటకులు ఎక్కువ రావడానికి కారణం జియోనా.. అని సీఎం ప్రకటించడం విశేషం. అయితే.. ఆయన మరణాన్ని వైద్యులే కాకుండా సాక్షాత్తూ సీఎం ధ్రువీకరించాక కూడా.. తమ తండ్రి మరణించలేదని.. అంత్యక్రియలు జరపమని మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచారు ఆయన కుమారులు. ప్రస్తుతం ఈ అంశం ఆసక్తి రేకెత్తిస్తోంది.
జియోనా చానా హైపర్‌టెన్షన్, డయాబెటిస్ కారణంగా మరణించారని ఐజ్వాల్ లోని ట్రినిటీ ఆసుపత్రి వైద్యులు తేల్చారు. అయితే ఆయన కుటుంబ సభ్యులు మాత్రం జియోనా చానా మరణించలేదని తేల్చి చెబుతున్నారు. పైగా.. అంత్యక్రియలు జరపకుండా మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకుని ఉంటున్నారు. ‘మా తండ్రి శరీరం ఇంకా వేడిగానే ఉంది. ఇంటికి తీసుకొచ్చిన నాడి కొట్టుకోవడం మొదలయింది. చనిపోతే శరీరం చల్లబడాలి. కానీ.. అలా జరగలేదు. కాబట్టి.. మానాన్న బతికే ఉన్నారు’ అని ఆయన కుమారులు అంటున్నారు.
తదీనిపై లల్ఫా కోహ్రన్ థార్ మత పెద్దలు స్పందించారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో జియోనా అంత్యక్రియలు చేసేందుకు కుటుంబమే కాదు.. భక్తవంగ్ గ్రామ ప్రజలు కూడా ఒప్పుకోరు’ అని మతం సెక్రటరీ జైటిన్‌ఖుమా అంటున్నారు. జియోనా చానాకు 38 భార్యలు, 89 మంది పిల్లలు. కొడుకులు, కోడళ్లు, మనవలు, మనవరాళ్లతో కలిపి ఆ కుటుంబంలో దాదాపు 175 మందికి పైనే ఉంటారు. 100 గదుల ఇంట్లో వీరు నివసిస్తున్నారు. వీరందరికీ జియోనా మాటే వింటారు.
క్రమశిక్షణతో ఉంటారు. జియోనా స్వతహాగా వడ్రంగి. ఇప్పటికీ అందరూ ఎవరి పనులు వారు చేసుకుంటారు. కుటుంబపోషణ, ఆహారం విషయంలో ఎటువంటి ఇబ్బందులూ లేవు. ఉమ్మడి కుటుంబంగా వీరంతా కలిసి ఉండటం. అదీ ఈరోజుల్లో విశేషమే. అందుకే ఈ ఊరికి.. వీరిని చూసేందుకే పర్యాటకలు వస్తూంటారు. ఏకంగా రాష్ట్ర సీఎం ఒక సామాన్య వక్తి గురించి ట్వీట్ చేసి సంతాపం తెలిపారంటే అదే కారణం.