నోటి దుర్వాసన సమస్యతో దాదాపుగా అందరూ ఇబ్బంది పడుతుంటారు. చాలామంది ఈ సమస్య పెద్ద సమస్య కాదని నిర్లక్ష్యం వహిస్తూ ఉంటారు. వయస్సుతో సంబంధం లేకుండా వచ్చే ఈ సమస్య కొన్ని వ్యాధులను సూచిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దంతాలు, నాలుకపై బ్యాక్టీరియా పెరగడం వల్ల ఈ సమస్య బారిన పడే అవకాశం ఉంటుంది. మౌత్ వాష్ లు ఉపయోగించడం ద్వారా కొంతమందిలో ఈ సమస్య తగ్గుతుంది.మౌత్ వాష్ లు వినియోగించినా తగ్గకపోతే మాత్రం నోటి దుర్వాసన ఇతర ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చని చెబుతున్నారు.
గొంతు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు కూడా కొన్నిసార్లు నోటి దుర్వాసన సమస్యకు కారణమవుతాయి. డయాబెటిస్ సమస్యతో బాధ పడేవాళ్లకు నోటి నుంచి కుళ్లిపోయిన పండ్ల వాసన వస్తుంది. లివర్ సంబంధిత సమస్యలతో బాధ పడేవాళ్లకు నోటి నుంచి కుళ్లిపోయిన గుడ్ల వంటి వాసన వస్తుంది. కొంతమంది నోటి దుర్వాసన సమస్యకు చెక్ పెట్టేందుకు వక్కలు, కిళ్లీలు నములుతూ ఉంటారు. ఇలాంటివి నమలడం వల్ల సమస్య మరింత తీవ్రం అయ్యే అవకాశం ఉంటుంది.
రోజుల తరబడి నోటి దుర్వాసన సమస్య వేధిస్తుంటే సమీపంలోని డెంటల్ డాక్టర్ ను సంప్రదిస్తే మంచిది. వైద్యులు సమస్యను గుర్తించిన తరువాత సమస్యకు చికిత్స చేయించుకుని నోటి దుర్వాసనకు చెక్ పెట్టవచ్చు. చిన్న సమస్యే కదా అని నిర్లక్ష్యం చేస్తే మాత్రం భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఆరోగ్యమే… మహాభాగ్యమని గుర్తుంచుకుని తగు జాగ్రత్తలు తీసుకుంటూ హాయిగా జీవించండి.