Health: కూరగాయలను ఎక్కువ సేపు ఉడికిస్తే.. వాటిలో పోషకాలు పోతాయా..?

కూరగాయలు అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఆరోగ్యం. విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఇలా ఇవన్నీ మన శరీరానికి రోగ నిరోధక శక్తిని ఇస్తాయి. కానీ కూరగాయలు వండితే వాటిలోని పోషకాలు పోతాయని చాలామంది నమ్మకం. నిజంగా అలా జరుగుతుందా.. నిపుణుల సమాధానం మాత్రం భిన్నంగా ఉంది. పచ్చిగా తిన్నా, వండినా రెండింటికీ వేర్వేరు ప్రయోజనాలున్నాయని వైద్యులు చెబుతున్నారు.

కూరగాయల్లో విటమిన్ సి, బి గ్రూప్ విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం వంటి నీటిలో కరిగే పోషకాలు ఉంటాయి. అందువల్ల ఎక్కువసేపు మరిగిస్తే ఈ విలువైన పోషకాలు వృథా అవుతాయి. కానీ ఒకవేళ ఆ మరిగించిన నీటినే సూప్‌లలో, కూరల్లో ఉపయోగిస్తే మళ్లీ శరీరానికి లభిస్తాయి. ఆ నీటిని పారబోతే మాత్రం లాభం తగ్గిపోతుంది.

అయితే వంటవల్ల పోషకాలు పూర్తిగా పోతాయని అనుకోవడం పొరపాటు. ఎందుకంటే కొన్ని కూరగాయలు వండిన తర్వాతే మన శరీరం వాటిని బాగా గ్రహిస్తుంది. టమాటాలో ఉండే లైకోపీన్ పచ్చిగా తింటే అంతగా శోషించబడదు. కానీ టమాటా పులుసు, కూర, సాంబార్ రూపంలో వండితే లైకోపిన్ ఎక్కువగా శరీరానికి అందుతుంది. ఇదే విధంగా క్యారెట్‌లోని బీటా కెరోటిన్ కూడా వండిన తర్వాతే శరీరానికి సులభంగా లభిస్తుంది.

మరోవైపు దోసకాయ, గాజర, బీట్రూట్, క్యాబేజీ లాంటి కూరగాయలు సలాడ్ రూపంలో పచ్చిగా తింటేనే వాటి ప్రయోజనం ఎక్కువ. కానీ బంగాళదుంప, వంకాయ, బెండకాయ, బచ్చలి వంటి కూరగాయలు మాత్రం తప్పనిసరిగా వండాలి. పచ్చిగా తింటే శరీరానికి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కూరగాయలు వండే పద్ధతిలోనే అసలు రహస్యం దాగి ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఎక్కువసేపు మరిగించడం, నూనెలో ఎక్కువగా వేయించడం వల్ల పోషకాలు తగ్గిపోతాయి. కాబట్టి తక్కువ మంటపై, తక్కువ సమయంలో, ఆవిరి వంట (steam cooking) చేయడం ఉత్తమం.

ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేవారు ఒకే పద్ధతిని కాకుండా, వేర్వేరు రకాలుగా కూరగాయలు తీసుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. కొన్నిసార్లు సలాడ్‌లా పచ్చిగా, ఇంకొన్నిసార్లు ఆవిరిలో ఉడికించి లేదా తక్కువ మంటపై వండి తింటే అన్ని రకాల పోషకాలు శరీరానికి సమతుల్యంగా అందుతాయి. ఇలా చేస్తే శరీరానికి కావలసిన విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా చేరి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అందువల్ల కూరగాయలను పచ్చిగా తింటేనే లాభం, వండితేనే నష్టం అనే భావన సగం నిజం మాత్రమే. కొన్ని పచ్చిగా తినాలి, మరికొన్ని వండి తినాలి. ముఖ్యంగా వంట చేసే పద్ధతి మీదే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.