గులాబీలు భార్యా భర్తల్ని ఏం చేశాయో చూడండి

ప్రేమని వ్యక్తం చేయడానికి ముందుగా గుర్తొచ్చేవి గులాబీలు. అంతేకాదు మనం ఇచ్చే గులాబీ రంగుని బట్టి అవతలివారిపైన మనం ఎలాంటి భావాన్ని వ్యక్తం చేస్తున్నామో తెలుస్తుంది. ఉదాహరణకి ఎర్ర గులాబీ ప్రేమని వ్యక్త పరచడమే కాకుండా అవతలి వారి అందాన్ని కూడా అభిమానిస్తున్నట్టు సూచన. ఇక తెల్ల గులాబీ ఇస్తే వారి ప్రేమ ఎంతో పవిత్రమైనది అని అర్ధం. ఇలా ఒకో రంగుకి ఒకో భావం.

మరి ఇలాంటి గులాబీలతో ఒక భార్యాభర్తల కేసుకి శుభం కార్డు వేశారు ఒక జడ్జిగారు. ఆ కథ కమామిషీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మధ్యప్రదేశ్ లోని దేవాస్ కు చెందిన యువతికి, ఇండోర్ కి చెందిన ట్యాక్సీ డ్రైవర్ తో 2012 లో పెళ్లయ్యింది. వీరికి ఒక కొడుకు ఉన్నాడు. సజావుగా సాగుతున్న వీరి సంసారంలో అనుమానం అడుగుపెట్టింది. భర్తకి వేరే మహిళతో సంబంధం ఉందని ఆ మహిళకి డౌట్ కలిగింది. దీనికి తోడు అతని ప్రవర్తన కూడా అనుమానం రేకెత్తేలానే ఉంటోంది.

దీంతో ఒకరోజు ఆ భార్య తన భర్తని గట్టిగ నిలదీసింది. అతడు చేసిన తప్పును ఒప్పుకున్నాడు. పెళ్ళికి ముందే తనకి ప్రేమ వ్యవహారం ఉందని తేల్చాడు. ఆ మహిళతో ఇంకా సత్సంబంధం కొనసాగుతుందని బయట పెట్టేశాడు. ఈ వ్యవహారం చిలికి చిలికి వివాదం చెలరేగడంతో ఆ భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. గృహ హింస చట్టం కింద భర్తపై కేసు నమోదు చేసింది. వ్యవహారం కోర్టు వరకు వెళ్ళింది.

వీరిద్దరిని కలపడానికి ఇండోర్ జిల్లా జడ్జి గంగాచరణ్ దూబే తన తెలివిని ఉపయోగించారు. ట్యాక్సీ డ్రైవర్ తన భార్యకు తిరిగి నమ్మకం కలిగించడానికి రోజూ ఉదయాన్నే భార్య ఇంటికి వెళ్లి ఎర్రని గులాబీ ఇవ్వాలని ఆదేశించారు. న్యాయమూర్తి చెప్పినట్టు అతడు ప్రతిరోజూ తన భార్యకి గులాబీని ఇస్తూ వచ్చాడు. కొద్దిరోజులకి వారి మధ్య మళ్ళీ ప్రేమ చిగురించింది. ఇద్దరి మధ్య దూరం తొలగి తిరిగి ఒక గూటికి చేరుకున్నారు.